8, నవంబర్ 2013, శుక్రవారం

అప్పటికీ ఇప్పటికీ తేడానే లేదు!

 సెప్టెంబరు  1, 1962 న ఆంధ్ర పత్రిక దినపత్రికలో వచ్చిన ఊమెన్ గారి కార్టూన్ 

పాపం నెహ్రూ గారి హయాంలో కూడా కాగ్రెస్ కు అంతర్గత కుమ్ములాటలు తప్పలేదు. పైగా అప్పట్లో కాంగ్రెస్ కు ఎదురు లేదు. ప్రతిపక్షం నామాక: మాత్రమే ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ లో టిక్కెట్ వస్తే చాలు అదొక గొప్ప పదవి దొరికినట్టే . ఇక గెలిచిన తరువాత ప్రతివాడూ పదవి కోసం మిగిలిన వాళ్ళ మీద ఎత్తుల మీద పై ఎత్తులు వేసుకుంటూ ఎంతకైనా తెగించి తమకు కావలిసిన పదవో కాంట్రాక్టో సంపాయించటమే పరమావధి. నెహ్రూ గారేమో సిద్దాంతాల మనిషి. కాయితాల మీద సుభాషితాలు నమ్మేసే వాడు. ఆయన ఉన్నప్పుడే కాంగ్రెస్ అలా ఉంటే ఆయన పోయిన ఐదేళ్ళకల్లా వారి కూతురు కాంగ్రెస్ ను రెండుగా చీల్చి పారేసింది.అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో జరిగే కుమ్ములాటలు ఊమెన్ గారు అద్భుతంగా చిత్రీకరించారు.

జాతీయ సమైక్యత  గురించి గోలకెత్తుతున్న పండిట్ జీ (నెహ్రూ) తన వెనుక జరుగుతున్నా అంతర్గత కలహాలు తెలియకా! తన ధ్యేయం, తన పార్టీలోనే ఆ సమైక్యత లేకపోవటం, ఆ విషయం ఒక సామాన్యుడు తనను ప్రశ్నించటంతో నివ్వెరపోతున్న నెహ్రూను,  ఈ కార్టూన్లో మనం చూడవచ్చు. నెహ్రూ ముఖంలో భావం అద్భుతంగా పండించారు ఊమెన్.

ఇక ప్రస్తుతానికి వస్తే, పార్టీ నాయకత్వమే విదేశీయుల చేతను పెట్టి, కొట్టుకోవటం మటుకు మానలేదు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమంటే, నానాటికీ కాంగ్రెస్ లోపల్లోపల కుళ్లిపోయి దిగజారిపోతుంటే, ప్రతిపక్షం కొంతలో కొంత క్రమశిక్షణ ఆలోచనలోనూ, ప్రవర్తనలోనూ కూడా చూపిస్తూ నానాటికీ బలపడింది.

ముందు ముందు ఏమి కానున్నదో చూడాలి మరి



7, అక్టోబర్ 2013, సోమవారం

హిందీ డౌన్ డౌన్




భారత దేశంలో ఉన్నన్ని భాషలు, మరే దేశంలోనూ ఉండి ఉండవు. మరి దేశం మొత్తానికి ఒకే  భాష ఉండి తీరాలా, ఉండాలంటే ఆ భాష  ఏ భాష? ఈ సమస్య భారత దేశాన్ని చాలా కాలంగా బాధించింది. స్వతంత్ర పోరాటం జరుగుతున్న రోజుల్లోనే, గాంధీ గారు, దేశం మొత్తం మీద హిందీ రుద్దటానికి శాయశక్తులా ప్రయత్నించి కొంతవరకూ కృతకృత్యులయ్యారనే చెప్పాలి. 
 విదేశీ దాడులను ఎక్కువగా ఎదుర్కుని, దక్షిణ భారత దేశంకంటే ఎక్కువగా దెబ్బలు తిని వాటివల్ల ఒక విధమైన దురుసైన నడవడికను సంతరించుకున్న ఉత్తర భారతీయులు, దేశాన్ని శాసించటం మొదలుపెట్టారు. సహజంగా తమదైన హిందీ భాషను అందరిమీదా రుద్దారు. దాని ఫలితమే, 1967-68 లో వచ్చి హిందీ డౌన్ డౌన్ ఉద్యమం. నాకు తెలిసి నేను చూసిన రెండో ఉద్యమం. మొదటిది విశాఖ ఉక్కు ఉద్యమం కాగా, రెండోది, ఈ హిందీ వ్యతిరేక ఉద్యమం.

దుందుడుకుతనంగా భాషా బిల్లును ప్రవేశపెట్టి, అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం, దక్షిణాత్యుల్లో ముఖ్యంగా అరవవాళ్ళను ఎక్కువగా దూరం చేసుకున్నది. తమిళులు ఏమైనా మనకంటే ఎక్కువ భాషాభిమానం
నిజలింగప్ప, బ్రహ్మానంద రెడ్డి, కామరాజ్
కలవాళ్ళు. అందుకని హిందీ ప్రచారాన్ని ఆ భాషను జాతీయ భాష అవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ఉద్యమపు చాయలు కొన్ని తెలుగునాట కూడ కొంతకాలం కనపడ్డాయి. అప్పటి రోజుల్లో హిందీ సినిమాలు ఆంధ్ర ప్రాంతంలో విడుదల కానివ్వలేదు. హిందీ మాష్టార్లు అందరూ దాక్కుని భయపడుతూ
బతికారు కొంతకాలం.  చివరకు ఆ ఉద్యమం సమసిపోయింది. మాకు అప్పట్లో

హిందీ అక్షరాలు వ్రాయటం ఎప్పుడు నేర్పటం మొదలు పెట్టారో తెలుసా ఐదో క్లాసులో మాత్రమే. అది హిందీకి ఉన్న ప్రాధాన్యత.  ఈ ఉద్యమం వల్ల జరిగిన మేలు మాకు సంతోషం కలిగించినది ఏమంటే, , హిందీలో 20 మార్కులు వస్తే చాలు పాస్ అవ్వటమే. చివరకు ప్రశ్నా పత్రం చూసి వ్రాసినా సరే, మార్కులు వేసి పాస్ చేశేవాళ్ళు. 

అప్పటి హిందీ వ్యతిరేక ఉద్యమం గురించి, ఊమెన్ గారు తనదైన శైలిలో చక్కటి కార్టూన్లు వేశారు.

2, అక్టోబర్ 2013, బుధవారం

చైనాకు వదలని దురాశ


 


ఈ కార్టూన్  ఐదు దశాబ్దాల క్రితం ఊమెన్ గారు 11 01 1963 వారపత్రికలో వేసినది. హిమాలయాలనే తమ దేశాంలోకి లాగేసుకోవలని చైనా దురాశ. ఇన్ని సంవత్సరాలు గడిచినా  కూడా చైన అదే దురాశారోగంతో తీసుకుంటూనే
అవగాహనలోనూ, అభిప్రాయంలోనూ ఎంతటి తేడా!
ఉన్నది. ఇప్పటికీ భారత్ భూభాగం కాజెయ్యాలని ప్రయత్నాలు మానటంలేదు. కాని విచిత్రం, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఇప్పటికీ, ఆస్ట్రిచ్ విధానాన్నే అద్భుతమైన ఉపాయంగా భావిస్తున్నారు. నెహ్రూ అలాగే 1962 భంగపడి, చైనా యుధ్ధంలో భారత్‌కు అవమానకరమైన ఓటమిని పొందేలాశా చేశారు. 


చైన తన దుష్టత్వాన్ని శతవిధాలా బయటపెట్టుకుంటూ, తమ దేశంలో పనిచెయ్యని, తమకు పనికిరాని,  తామే కనుమరుగుచేస్తున్న  ఇజాన్ని భారత్ కు  ఎగుమతి చెయ్యటానికి ఇక్కడ ఉన్న అవివేకులను, బలహీన మనస్కులను లోబరుచుకుని వాళ్ళకు లోపాయికారీగా సర్వవిధాలా సహాయపడుతూ, భారత్ ను బలహీన పర్చాలని చైనా కుట్ర చేస్తూనే ఉన్నది . 


ఇది పూర్తిగా తెలిసి ఉండి కూడా "గాడిదగుడ్డేమీ కాదూ" అంటూ ఓట్రించే చైనా భక్తులూ మన మధ్యనే ఉన్నారు.చైనా యుధ్ధం జరుగుతున్న సమయంలో  ఊమెన్ గారు "లోకం పోకడ" లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో    30 11 1962 వారపు సంచికలో వేసిన కార్టూన్. 


1962 నాటికి నెహ్రూ గారు పంచషీల, ఇంకా అటువంటివే ఏవేవో సుభాషితాలు వల్లిస్తూ, అదే మన విదేశీ నీతని మురిసిపోతూ, నోబెల్ శాంతి బహుమతి కోసం ఎదురుచూస్తూ, భారత్ కు కావలిసిన సైనిక పాటవాన్ని ఇనుమడించటంలో, పూర్తి అశ్రధ్ధ వహించారు. ఆయనగారి రొమాంటిక్ ఆలోచనలను పూర్తిగా వాడుకుంటూ, చైనా భారత్ నుఆమ్రమించుకోవటానికి పన్నాగాలు పన్నటం మొదలెట్టింది. ఆపైన ఇక్కడున్న వాళ్ళ ఏజెంట్లు ఏమని సమాచారం అందించారో మరి, 1962లో భారత్ ను ఆక్రమించటానికి దాడి చేసింది.  బలహీన స్థితిలో ఉన్నా, సరైన ఆయుధాలు, దుస్తులు లేకపోయినా కూడా, భారత సైనికులు వీరోచితంగా పోరాడి, పాణాలొడ్డి  అప్పటికే చైనా ఆక్రమించుకున్న చోటినుండి ముందుకు  రాకుండా నిలువరించగలిగారు. ఈ దెబ్బతో , నెహ్రూ గారికి తన సుభాషితాల విలువ తెలియవచ్చి, భారత్ సైనిక బలాన్ని పెంచవలసిన అగత్యాన్ని, ఆవశ్యకతను తెలియవచ్చి, రక్షణ శాఖ మీద ఎక్కువ శ్రధ్ధ పెట్టేట్టుగా చేసింది. ఊమెన్ గారు ఈ కార్టొన్లో 1962లో భారత్ సైనికుడు, అంటే చైనా దురాక్రమణకు ముందు ఆ తరువాత 1963 లో చైనా చేతిలో దెబ్బ తిన్న తరువాత భారత సైనికుడు ఉన్న పరిస్థితిని పోల్చి చూపుతున్నారు ఈ కార్టూన్లో. 

కమ్యూనిస్ట్ చైనా భారత్ మీద దాడివల్ల భారత దేశంలో కమ్యూనిస్ట్ కోలుకోలేని దెబ్బ తిన్నది. వాళ్ళను నమ్మేవాళ్ళే కరువయ్యారు. 1962లో చైనా భారత్ మీద దురాక్రమణ చెయ్యకుండా ఉండి ఉంటె, ఏమో, కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికంటే కొద్దిగా బలంగా ఉండే అవకాశాలు ఉండేవేమో. తమ ఇజాన్ని ఎగుమతి ఆత్రంలో, చైనా భారత్ మీద దాడి చేసి, భారత దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికీ పెరగకుండా చేసింది. కాని ఇప్పటికీ  తమ ఇజం ఎగుమతి పధ్ధతి వదిలినట్టులేదు. 

భారత్ మీద చైనా దురాక్రమణ తరువాత, ఈ ప్రాంతంలో  ఉన్న ఇతర దేశాలకు చైనా అసలు రంగు తెలిసింది. అప్పటికి సిక్కిం మన దేశంలో భాగం కాదు,  ప్రత్యేక దేశం. సిక్కిం, భూటాన్, నేపాల్ దేశాలు చైనా అసలు స్వరూపం  చూసి ఝడుసుకుని, భారత్‌కు దగ్గిర అవుతాయని  ఈ కార్టూన్లో  ఊమెన్ గారి ఊహ. ఆయన అంచనా కొంతవరకూ నిజమయ్యింది. 1975 ప్రాంతాల్లో సిక్కిం, భారత్ లో భాగమై, సిక్కిం  రాష్ట్రంగా అవతరించింది. భూటాన్ భారత్ తోనే ఎక్కువ స్నేహం కాని చైనాతో  అంత స్నేహం లేదు. కాని నేపాల్ విషయంలో మటుకు మన విదేశీ నీతి ఘోరంగా దెబ్బ తిన్నది. 1980ల చివరి రోజుల్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం, నేపాల్ ను అవమానకరమైన పధ్ధతిలో వారితో వ్యవహరించటం వల్ల,  నేపాల్ చైనాకు దగ్గిర అవ్వటం మొదలు పెట్టింది. చివరకు, అక్కడ రాజకుటుంబం మొత్తం హత్య కావించబడి, ఎన్నికల్లో కమ్యూనిస్టులు గెలిచి రాజ్యాధికారంలోకి వచ్చారు. ప్రస్తుతానికి నేపాల్ లో పరిస్థితి  భారత్ కు అనుకూలమా అంటే, గట్టిగా అవును అని చెప్పగలిగిన స్థితిలో లేదు. ఈ విషయంలో, భారత్ తప్పకుండా తమ విదేశీ నీతికి మరింత పదును పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

నిజానికి టిబెట్ అనే ప్రాంతం
ప్రత్యేక బౌధ్ధ దేశం, ఆ దేశాధినేత దలైలామా  బారత్ కు చైనాకు మధ్య ఉన్న "బఫర్ స్టేట్".   అంటె రెండు శక్తివంతమైన, పెద్ద  దేశాల మధ్య ఉన్న ఒక చిన్న దేశాన్ని, వాళ్ళీద్దరూ కొట్టుకోకుండా ఉన్న  ప్రాంతాన్ని "బఫర్ స్టేట్" అని పిలుస్తారు.  టిబెట్ ను ఆవిధంగా ఉంచి బ్రిటిష్ వారు చైనాతో భారత్ కు సరిహద్దు లేకుండా జాగ్రత్త పడ్డారు. కాని నెహ్రూ గారి  అవకతవక విదేశీ విధానాల వల్ల, సరైన సమయంలో టిబెట్ ను భారత్ కాపాడలేదు. దానివల్ల, టిబెట్ ను చైనా ఆక్రమించి తమ దేశంలో కలిపేసుకుని, భారత్‌కు  పిలవని పేరంటంగా,  పొరుగు దేశంగా అవతరించి, మనకు ఎనలేని కష్టాలు తెచ్చిపెట్టింది. స్వతంత్రం సాధించగానే సరికాదు, దేశాన్ని పరిపాలించగల సత్తా ఉన్న నాయకులు, దేశాన్ని పరిపాలించాలి.  అటువంటి నాయకులు లేకపోవటం, భారత దేశపు దురదృష్టం.   




**********************************
చైనా యుధ్ధం, ఆ యుధ్ధం జరిగిన తీరు, రాజకీయ తప్పిదాలు చక్కగా సమగ్రంగా వివరిస్తూ  శ్రీ సుబ్రహ్మణ్య చైతన్య తన బ్లాగు "స్వర్ణ ముఖి" లో   అద్భుతమైన వ్యాస పరంపర వ్రాశారు . ఆ వ్యాస పరంపరను ఈ కింది లింకు నొక్కి చదువుకొనవచ్చు                                                                                మేరునగ తప్పిదం క్లిక్
**********************************

28, సెప్టెంబర్ 2013, శనివారం

అత్తకూ అదే సమస్య - కోడలుకూ అదే సమస్య



ఈ కార్టూన్ ఊమెన్ గారు 1969, జూన్ నెలలో వేసినది. అప్పట్లో తెలంగాణా సమస్యగానే పరిగణించారు. పదవి దొరకక ఉన్న పదవితో తృప్తిపడలేని వారు నాయకత్వం వహించటం వల్ల, తెలంగాణాను కోరుకుంటున్న వారు నిజంగానే ప్రత్యేక రాష్ట్రం కావాలనుకుంటున్నారా, లేదా ఈ రాజకీయ నిరుద్యోగులు రెచ్చగొడితే, పదేళ్ళకొకసారి, మరొకొన్ని దశాబ్దాల తరువాత మరొకసారి ప్రత్యేక  తెలంగాణా మాట తెరమీదకు వస్తున్నదా అనేది శేషప్రశ్నగానే ఉన్నది. 

అప్పట్లో ఇందిరాగాంధీ తనదైన శైలిలో చెన్నారెడ్డిగారిని అటుచేసి
ఇటుచేసి తన పక్కకు తిప్పుకుని, ఆయన పార్టీ ద్వారా తెలంగాణా "సెంటిమెంట్" ను బాగా వాడుకుని ఎన్నికల్లో లబ్ధి పొంది, ఆయన పెట్టిన తెలంగాణా ప్రజా సమితి పార్టీని కాంగ్రెస్ లో కలిపేసుకున్నారు.



అప్పట్లో ఇందిరాగాంధీకి వచ్చిన సమస్యే ఈనాడు ఆమె గారి కోడలికీ వచ్చింది. కాని ఇప్పటికీ  ఇది సమస్యగానే  పరిగణించి,  రాజకీయపు ఎత్తుగడలతో తాము సమస్య  అనుకునేది పరిష్కరిద్దామనే  కాని, అసలు ఈ గందరగోళానికి మూలాలు ఏమిటి, ఎక్కడ నుంచి మొదలుపెట్టి, మళ్ళీ  ఇలాంటి నిరసనలు, ఆందోళనలు పెచ్చరిల్లకుండా తీసుకోవాలిసిన చర్యలు, పరిష్కార మార్గాలు ఆలోచించాలి అన్న విషయం కూడా ఇప్పుడున్న ఆ కోడలికి కాని (పాపం విదేశీయురాలు, ఉత్సవ విగ్రహం), ఆమె చుట్టూ చేరిన అసలు సిసీలైన భారతీయ గ్రహాలకు గాని తట్టకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు.

ఎందుకు అంటె, ఏ గూటిలోని చిలుక ఆ గూటిలోని పలుకే పలుకుతుంది. కాంగ్రెస్ అనే పార్టీ, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సర్వభ్రష్టూ పట్టిపోయి, అందులో  ఎవరు చేరవచ్చు, ఎవరు చేరకూడదు అన్న గణనే లేకుండా, ఎవడు పడితే వాడు పదవి కోసం, చేరిపోయారు. గత కొన్ని దశాబ్దాలుగా, కాంగ్రెస్ ఏ సమస్యనూ సవ్యంగా  పరిష్కరించలేకపోయింది. కాంగ్రెస్ కు ప్రతి సమస్యలోనూ  రాజకీయ లబ్ధి మాత్రమే కనిపిస్తుంది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుని, అప్పటికప్పుడు వచ్చే తాత్కాలిక లబ్ధి పొందటమే పరమావధిగా ఎంచుకుంటున్నది.
దురాలోచనే కాని దూరాలోచన అనేది ఒకటి ఉంటుందన్న విషయం తెలిసిన వాళ్ళు ఒక్క కాంగ్రెస్సులో ఏమిటి ఇవ్వాళ దేశంలోనే కరువయ్యారు. ఎక్కడన్నా ఉంటే గింటే రాజకీయ అనామకులుగానే ఉన్నారు తప్ప, పెద్ద పదవుల్లో లేరు.
 
ఏతావాతా చెప్పొచ్చేది ఏమంటే, 1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని అప్పట్లో కాంగ్రెస్ ఇందిరా గాంధీ నాయకత్వంలో సమర్ధవంతంగా తమకు రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాడుకుని  వదిలేశారు. అప్పట్లో రాజకీయ వైకుంఠపాళీలో నిచ్చెన ఎక్కామని మురిసిపొయ్యారు.  కాని ఈనాడు, అదే రాజకీయ వైకుంఠపాళీలో పాము నోట్లో పడి దిగజారుతున్నారు. అంతకంటే ఘోరం, జరుగుతున్న విషయం గమనించుకోలేక, ఆ దిగజారుడే తమకు లాభం కలిగిస్తుందన్న అపభ్రంశపు ఆలోచనలో ఉన్నట్టుగా కనపడుతున్నది.      ఎప్పటికన్నా మన రాజకీయ పార్టీలు, పెద్ద మనసుతో ఆలోచించి సమస్యలకు, ప్రజా నిరసనలను అర్ధంచేసుకుని సవ్యమైన పరిష్కార మార్గాలు సూచించగలిగిన స్థాయికి ఎదగగలవా!? 


ఊమెన్ గారు 1969లో వేసిన కార్టూన్  ఈ నాటికి అన్వయించవచ్చు. కాకపోతే అప్పట్లో ఇందిరాగాంధీ, సమస్యకు పరిష్కారం చిక్కక చెమటలు పట్టించుకుంటే, ఈనాడు వారి కోడలు గారు, రాజకీయ లబ్ధి మాత్రమే పరమావధిగా  "రాజకీయ నిర్ణయాలు" తీసుకుంటూ, సమస్యలను సమస్యలుగా కాకుండా రాజకీయ అవకాశాలుగా  భావిచుకోవటం  ఒక్కటే ఈ 40 ఏళ్ళల్లో వచ్చిన మార్పు. 
 

ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్  లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి పరిష్కారం కనిపిస్తుందంటే ఎవరూ నమ్మలేని విషయంగా ఉన్నది. అత్తగారు పరిష్కరించలేని సమస్య కోడలు గారు పరిష్కరించగలరా పైగా  విదేశీ కోడలు! చూద్దాం ఏమి జరుగనున్నదో.




22, సెప్టెంబర్ 2013, ఆదివారం

పాపం గెరాల్డ్ ఫోర్డ్


పైనున్న కార్టూన్ ఫిబ్రవరి 1977 మొదటి వారంలో ప్రచురించబడింది.  అమెరికా చరిత్రలో  ప్రెసిడెంట్‌గా ఎన్నిక అవ్వని/అవ్వలేని ఏకైక ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్. వాటర్ గెట్ స్కాండల్ లో పూర్తిగా కూరుకుపోయి, చివరకు కాంగ్రెస్ (వాళ్ళ పార్లమెంట్) అభిశంసన తప్పించుకోవటానికి అప్పటి ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ రాజీనామాతో ఉపాధ్యక్షుడిగా ఉన్న   గెరాల్డ్ ఫోర్డ్, అమెరికా రాజ్యాంగం ప్రకారం అద్యక్షుడిగా అయ్యాడు. 

చిత్రం ఏమంటే,  రిచర్డ్ నిక్సన్ తో బాటుగా 1972 ఎన్నికల్లో ఉపాద్యకుడిగా ఎన్నిక అయినది గెరాల్డ్ ఫోర్డ్ కాదు . ప్రజలు ఎన్నుకున్నది అద్యక్షుడిగా నిక్సన్ తో పాటుగా ఉపాధ్యక్షుడిగా స్పైరో అగ్నూని. కాని అగ్నూ 1973లో టాక్సు గొడవల్లో చిక్కుకుని రాజీనామా చెయ్యాల్సి వచ్చింది. ఆ తరువాత గెరాల్డ్ ఫోర్డును నిక్సన్ తన ఉపాధ్యక్షుడిగా నియమించుకున్నారు. 

ఆ విధంగా ప్రజల చేత అద్యక్షుడిగా ఎన్నిక అవ్వకుండా అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన ఏకైక వ్యక్తిగా గెరాల్డ్ ఫోర్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. కాని అంతకంటే ఫోర్డ్ అధ్యక్షుడిగా సాధించింది ఏమీ లేదు. పైగా తనను ఉపాధ్యక్షుడిగా తీసుకున్నందుకు, నిక్సన్ ను ఆయన వాటర్ గెట్ స్కాండల్ వల్ల  రాజీనామా అనంతరం, క్షమించి, క్రిమినల్ చర్యలు తీసుకోకుండా ప్రెసిడెన్షియల్  పార్డన్ ఇచ్చి ఊరుకున్నారు. దీంతో నిక్సన్ తో ముందుగానే ఒక ఒప్పందం చేసుకుని అధ్యక్ష పీఠం  ఎక్కారని ఫోర్డ్ అపకీర్తి మూటగట్టుకున్నారు. 

అయినా సరే 1976 అద్యక్ష ఎన్నికల్లో, పదవిలో ఉన్న అధ్యక్షడిగా, ఎన్నికల్లో నుంచున్నారు ఫోర్డ్. రిపబ్లికన్ పార్టీ వారు కూడా, నిక్సన్ దెబ్బకు తమ పార్టీ గెలిచే అవకాశాలు ఎలాగో లేవన్న నిస్పృహలో ఏదో ప్రస్తుతపు అధ్యక్షుడే కదా అని తమ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికలో అబ్యర్ధిగా ఉంచారు. 

కాని, వియత్నాం యుద్ధంలో అపజయం, కంబోడియా లావోస్ లలో ఎదురు దెబ్బలు, అన్నీ కంటే వాటర్ గేట్ స్కాండల్ వల్ల, పెద్దగా ఎవరికీ తెలియని డెమొక్రాటిక్ అబ్యర్ధి జిమ్మీ కార్టర్ ఫోర్డును ఓడించారు. అమెరికన్ రాజ్యాంగం ప్రకారం ప్రతి అద్యక్షుడు తప్పకుండా నాలుగేళ్ళు పదవిలో ఉంటారు. కాబట్టి 1976 చివరి వరకూ ఫోర్డు ప్రెసిడెంట్ గా ఉండి  1977 లో పదవీ విరమణ చేశారు.  ఏదో నామకే వాస్తే అమెరికా అద్యక్షుడిగా కొద్ది కాలం ఉండి  వెళ్ళిపోయిన గెరాల్డ్ ఫోర్డ్ గురించి ప్రపంచ చరిత్రలో ఏమి వ్రాయబోతున్నారో, ఊమెన్ గారి ఊహ పైనున్న కార్టూన్. ఆయన అనుకున్నట్టుగానే గెరాల్డ్ ఫోర్డ్ అనామకంగానే నిలిచారు. 

విచిత్రం ఏమంటే, ఏ జిమ్మీ కార్టర్ ఐతే గెరాల్డ్ ఫోర్డ్ మీద ఘన విజయం సాధించారో, అదే జిమ్మీ కార్టర్ 1980 ఎన్నికల్లో రోనాల్డ్ రీగన్ చేతిలో చిత్తుగా ఓడిపొయ్యారు. కారణం, ఇరాన్ లో అమెరికన్ ఎంబసీ మీద అప్పటి ఖోమీనీ ప్రేరిత విద్యార్ధులుగా పిలవబడుతున్న వారు దాడి చేసి, ఎంబసీ సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. ఆ విషయాన్నీ సవ్యంగా, అమెరికాకు ఉన్న మిలిటరీ శక్తిని కూడా  వాడలేని అశక్త , దద్దమ్మ అద్యక్షుడిగా ముద్ర పడింది కార్టర్ మీద. ఆ దెబ్బకి, రిపబ్లికన్లు మంచి బలమైన రోనాల్డ్ రీగన్ ను అద్యక్ష పదవికి ఆబ్యర్ధిగా ఉంచారు. రీగన్ కార్టర్  మీద గెలిచి, ఆ తరువాత రెండోసారి కూడా అద్యక్ష ఎన్నికల్లో గెలిచి, అమెరికా ఎకానమీ మీద, విదేశీ విధానం మీద  చెరగని తనదైన ముద్రవేశారు. 

ఏది ఏమైనా అమెరికా  ఇతర దేశాల వ్యవహారాల్లో లో వేలు పెట్టటం వల్లనే (వియత్నాం, కంబోడియా, లావోస్, ఇరాన్) ఆ ప్రభావం వారి దేశీయ రాజకీయాల మీద కూడా విపరీత ప్రభావం చూపింది.


మేము చేస్తే ఒప్పు-మీరు చేస్తే తప్పు

ఈ కార్టూన్ 1976 లో ప్రచురితం. అప్పట్లో కోల్డ్ వార్ (మన  తెలుగు పద పండితులు దీనికి తెలుగు చేసినట్టు లేదు) అదే ప్రచ్ఛన్న యుద్ధం అమెరికా నాయకత్వం వహిస్తున్న నాటో దేశాలకు, కమ్యూనిస్ట్ రష్యా నాయకత్వం వహిస్తున్న వార్సా పాక్ట్ దేశాలకు బాహాటంగానే జరుగుతున్నది. ఎవరికి వాళ్ళు,  తమ ప్రాబల్యం పెంచుకోవటానికి దేనికైనా  వెనుదీయటం లేదు. చివరకు మాడ్ (MAD) అనే మాట వాడుకలోకి వచ్చింది అంటే Mutually Assured Destruction. రెండు  వర్గాల దగ్గర అణు బాంబులు అంతకంటే ఎక్కువైనవే ఉండేవి. ఏ క్షణాన ఏమి జరుగుతుందో అని యూరోప్, అమెరికా ఖండాల ప్రజలు గుబగుబలాడుతూ ఉండేవారు.

రష్యా తన  కమ్యూనిజాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి మొదలు పెట్టింది. ఈ ఎగుమతి విధానం వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో,  జర్మనీ ఆక్రమించిన తూర్పు యూరోపు దేశాలను జర్మన్ల నుంచి విముక్తి చేస్తున్నట్టుగా నటిస్తూ, తమ తాబేదార్లను అక్కడ పరిపాలకులుగా ఉంచుతూ జర్మనీ వరకూ రష్యన్ సేనలు ముందుకు వెళ్ళటంతో బాగా మొదలయ్యింది. 

అలా 1944-45 లో మొదలయిన రష్యన్  కమ్యూనిజం  ఎగుమతి, 1970 లలో బాగా ప్రబలి, పెచ్చరిల్లింది. 1979 చివరి వారంలో ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించటం ఆ ఎగుమతికి పరాకాష్ట. కానీ,పాపం రష్యన్ల పాలిట ఆఫ్ఘన్ ఆక్రమణే  యు ఎస్ ఎస్ ఆర్ గా పేరొందిన కమ్యూనిస్ట్ సామ్రాజ్యపు విచ్చిన్నానికి దారి తీసింది.

అంగోలా దగ్గరకు వస్తే, రష్యన్లకు తోడుగా, అమెరికాకు పక్కలో బల్లెంలా ఉన్న క్యూబా కూడా  తోడయ్యింది. అంగోలా దేశానికి అప్పుడప్పుడే స్వాతంత్ర్యం వచ్చే అవకాశం ఉన్నది.  కాని ఈలోగా అక్కడ అంతర్యుద్ధం మొదలయ్యింది. పోర్చుగీసు వారి వలస పాలననుండి  తమ దేశాన్ని విముక్తి చేసుకోవటానికి, అంగోలా ప్రజలు ఎం పి ఎల్ ఎ (MPLA) అంగ్లంలో Popular Movement for the Liberation of Angola అనే సైనిక బృందం తయారయ్యింది. వాళ్ళకి రకరకాల ఎర  చూపించి రష్యా వాళ్ళ పక్కన చేరింది. తమ ఉపగ్రహపు దేశమైన క్యూబా చేత సైన్యాన్ని పంపిస్తూ, తన ఆయుధాలను అంగోలాకు సరఫరా మొదలు పెట్టింది. 

అదే సమయంలో నేషనల్ ఫ్రంట్ ఫర్ లిబరేషన్ అఫ్ అంగోలా (FNLA) National Front for the Liberation of Angola అనే మరొక పోటీ సైన్యం తయారయ్యింది. ఈ రెండూ కూడా పోర్చుగీసు వాళ్ళు వెళ్లి పోంగానే, తమలో తాము అంగోలా దేశంలో  అధికారం చేచిక్కించుకోవటానికి తన్నుకోవటం మొదలు పెట్టారు. శత్రువుకు శత్రువు,  తనకు  స్నేహితుడు అన్న నియమం పాటిస్తూ, అమెరికా సహజంగా FNLA పక్కన చేరింది. 

ఇప్పుడు ఊమెన్ గారి కార్టూన్ చూద్దాం 

పై కార్టూన్లో ఎడమ పక్కన ఉన్నది అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింజర్  కుడి పక్కన నెత్తిన తట్టతో,  మొహానికి నల్ల రంగు పూసుకుని,  ఆఫ్రికన్ లాగ కనపడుతున్న మనిషి,  అప్పటి రష్యన్ నియంత లియోనిద్ బ్రెజ్నేవ్. 

ఆ రోజుల్లో రష్యా ఏ విధంగా బూకరించి, ఎలాగోలాగా ప్రతి దేశానికి తమ బ్రాండ్  కమ్యూనిజాన్ని ఎగుమతి చెయ్యటానికి ఎన్ని విధాల టక్కుటమారపు విద్యలు ప్రదర్శించేదో ప్రపంచానికి మొత్తానికి తెలుసు. అలా అంగోలాలో తాము మాత్రమే వేలు పెట్టవచ్చని,  తాము కూడా  ఆఫ్రికన్లమేనని బ్రెజ్నేవ్ బూకరిస్తున్నట్టుగా ఊమెన్ గారి  కార్టూన్లోని వ్యంగ్యం.  సామాన్యంగా మీరు చేస్తే తప్పు మేము చేస్తే ఒప్పు అన్నట్టుగానే రష్యన్ విదేశీ తంత్రం అంతా నడిచేది. 

ఇలా అని అమెరికా ఊరుకున్నదని కాదు. రష్యాను నిలవరించటానికి రకరకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు. కాని వాళ్ళ ప్రయత్నాలు కలిసి వచ్చేవి కాదు. వియత్నాం, కంబోడియా, లావోస్, కొరియా వంటి దేశాల్లో ముఖం  పగలగోట్టుకున్నారు. కాని ప్రయత్నం మటుకు మానలేదు. అంగోలాలో తమ సైన్యాన్ని పంపకుండా, అమెరికన్  కిరాయి సైనికులను పంపింది. వాళ్ళను ఎం పి  ఎల్ ఎ వాళ్ళు పట్టుకుని, ఫైరింగ్ స్క్వాడ్ తో కాల్చి పారేసేవాళ్ళు. కారణం యుద్ధాల్లో మేర్సినరీస్ అంటే కిరాయి సైనికులకు శిక్ష మరణశిక్షే. 

అంగోలాలో చివరకు క్యూబా పంపిన సైన్యాల సహాయంతో, రష్యా అండన     ఎం పి  ఎల్ ఎ  అధికారంలో కి వచ్చి ఆ దేశాన్ని సర్వ భ్రష్టు పట్టించింది.  ఆఫ్రికాలోనే ఉన్న జింబాబ్వే అనే మరొక దేశం కూడా, ఈ సోషలిజపు గాలి సోకి ఇప్పుడు ఎలా ఉన్నదో చూస్తూనే ఉన్నాము.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన "గాడ్స్ మస్ట్  బి క్రేజీ (Gods Must be Crazy) హాస్య ప్రధానమైన సినిమాల్లో (మూడు వేరు వేరు భాగాలుగా వచ్చినట్టున్నాయి) రెండో భాగంలో అనుకుంటాను, ఆఫ్రికాలో,  క్యూబన్ సైనికులు ఉండటం అనే విషయాన్ని ఆటపట్టిస్తూ ఒక ప్రహసనం ఉన్నది. 

ఏది ఏమైనా ఇజాలు ఎగుమతికి పనికిరావని, బెడిసి కొడుతుందని, రష్యన్ ఉదంతం తేల్చి చెప్పింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా తమ ఇజాన్ని ఎక్కించబోయి, చివరికి తమ స్వంత దేశంలోనే బొక్కబోర్లా పడి, ఆ ఇజం పెద్దగా ఎవరి సహాయమూ లేకుండా రష్యన్ ప్రజలే వాళ్ళకి అక్కర్లేదని ఆవతల పారేశారు. 




18, సెప్టెంబర్ 2013, బుధవారం

పసలేని నినాదాలు - ఓపిక పట్టండి!

మరికొంత సమయం కావాలి, అవును మరి నినాదాలు ఇచ్చినంత సులభం కాదుకదా, ఆ నినాదాలను అమలుపరచటం! గరీబీ హటావో అన్న నినాదం వాడుకుని ఎన్నకల్లో గెలిచినంత మాత్రాన ఇల్లు అలికేశామని ఇక పండుగే అని ఆనందించిన రాజకీయ నాయకులకు ప్రజలు నిలదీస్తారని తెలియకపోవటమేమిటి? తెలుసు. కాని వాళ్ళేమి చెయ్యగలరులే అందునా గరీబీలు వాళ్ళకున్న సత్తా ఏమిటి వాళ్ళ చేత  కావాలిసిన పని చేయించుకోవటం వెన్నతో పెట్టిన విద్య అన్న లోపలి ధీమాతో, బయటకి మాత్రం ఎంతో వినయంగా, "మరికొంత సమయం కావాలి" అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఇందిరా గాంధీ అడగటం, ఆ అడుగుతున్న భంగిమ, వెనకాల నుంచున్న చెంచా మోహంలో హావ భావాలు, పాపం ఆ గరీబీ ఎంతో ఆశగా వచ్చి నిలదీయటం, చివరకు ఇందిరా గాంధీ "ఓపిక పట్టండి" అనటంతో అతని మోహంలో నిరాశ కార్టూన్ చూసిన క్షణంలో అర్ధం అయ్యేట్టుగా వేసిన ఊమెన్ గారికి హాట్స్ ఆఫ్. 


 తన అనుచరులు నిలదీస్తున్న ప్రజలను చూసి వణుకుతున్నా, వారి నాయకురాలిగా సమయస్పూర్తితో "ఓపిక పట్టండి" అని  ఠకీమని నిజాయితీ లేని జవాబు ఇచ్చి రాజకీయ మనస్తత్వాన్ని చక్కగా స్పురింపచేసింది అప్పటి ప్రధాని  గాంధీ. 

ప్రజలు మాత్రం ఏమి చేస్తారు! వేచి చూస్తూనే ఉన్నారు, వారి  ఓపిక అనంతం కదా. ఆ అనవసర ఓపికే అన్ని అనర్ధాలకూ మూలం.




17, సెప్టెంబర్ 2013, మంగళవారం

ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం - కార్టూన్లు

 ఈ కార్టూన్ ప్రచురించబడిన రెండు మూడు నెలలకల్లా ప్రత్యెక ఆంధ్ర ఉద్యమం జావకారిపోయింది, ఆపైన కాగ్రెస్  అధీనం లో ఉన్న కేద్ర ప్రభుత్వం, సి ఆర్ పి  దళాలను, సైన్యాన్ని  దింపి ఉద్యమాన్ని అణచిపారేసింది. 350 ఉద్యమకారుల మరణం వృధాఅయిపోయింది

 350 పైగా ప్రత్యెక ఆంధ్ర ఉద్యమకారులు పోలీసు/సి ఆర్ పి/సైన్యపు కాల్పుల్లో మరణించారు 


అటు తెలంగాణా 1969లో, ఇటు ఆంధ్రా 1972 లో ప్రత్యెక రాష్ట్రాలు అడిగినప్పుడు  ఇవ్వకుండా , కాంగ్రెస్, నెత్తి మీదకు తెచ్చుకున్నది,ఆంధ్ర ప్రాంతానికి  తీరని అన్యాయం చేసింది . కాంగ్రెస్ , ఆంధ్ర ప్రాంతానికి  ఎప్పటికీ కోలుకోలేనంతటి, చారిత్రాత్మకమైన అన్యాయం చేసింది 


పైన ఉన్నవన్నీ కూడా 1972 సెప్టెంబరు నుంచి మార్చి 1973 వరకూ జరిగిన ప్రత్యెక ఆంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో  ఆంధ్ర  పత్రిక దిన/వార పత్రికల్లో  ఊమెన్ గారు వేసిన కొన్ని కార్టూన్లు. 

చిత్రం ఏమంటే, ఎక్కడైతే ప్రత్యెక ఆంధ్ర అని మహోద్యమం జరిగిందో, ఎక్కడైతే 350 మంది, సి ఆర్ పి /సైన్యం కాల్పుల్లో (ఆత్మహత్యలు కాదు) మరణించారో, ఆదే ఆంధ్ర ప్రాంతంలో,  ప్రస్తుతం (సెప్టెంబరు 2013) సమైక్య ఆంధ్ర ఉద్యమం ఉధ్రుతిన నడుస్తున్నట్టుగా టివి వార్తల్లో కొన్ని చానెళ్ళు చూస్తుంటే అనిపిస్తున్నది. అప్పటి ఉద్యమంలో మరణించిన వారి ఆత్మలు ఎంత క్షోబిస్తున్నాయో కదా! వారి ఆత్మలకు శాంతి  కలిగే దారి కనపడటం లేదు. 

అప్పట్లోనే ప్రత్యేక ఆంధ్ర ఏర్పడి ఉంటే, ఆంధ్ర ప్రాంతం   ఎంతో  అభివృద్ధి  చెంది ఉండేది.  అభివృద్ది లేకుండా మిగిలిపోయింది ఆంధ్ర ప్రాంతం. ఇప్పటికన్నా తెలివినపడి,  ప్రత్యెక రాష్ట్రం తెచ్చుకుంటే (జరగబోయ్యే దానికి ఒప్పుకుంటే చాలు) మళ్ళీ నాలుగు దశాబ్దాల తరువాత, బాధపడే అవసరం రాదు అని నా భావన.  

అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంతానికి ఘోరమైన  అన్యాయం చేసింది  ఐనా  సరే ఆంధ్ర  ప్రాంతపు వారికి (అపార్ధాలు చేసేసుకోకండి నేను  విజయవాడలో పుట్టి  పెరిగినవాడిని) ఏ  మాత్రం రాజకీయ పరిజ్ఞానం లేదని 1977 ఎన్నికల్లో నిరూపించుకున్నారు. 1972-73 లో కాంగ్రెస్  ఇంతటి అన్యాయం చేసినా సరే, గట్టిగా నాలుగేళ్ల తరువాత ఎమర్జెన్సీ విధించి దేశం మొత్తాన్ని  వంచించిన కాంగ్రెస్ కు 1977 ఎన్నికల్లో  42 లో 41 సీట్లు పళ్ళెంలో  పేట్టి ఇచ్చారు.  అది కూడా ఎప్పుడు, ఉత్తర భారత దేశం మొత్తం కాంగ్రెస్ ను ఓడించినప్పుడు! విజయవాడలో తెలుగు వాడైనప్పటికీ, ఆ ఊళ్ళో ఎవరికీ ముక్కూ-మొహం తెలియని ఉత్తర ప్రదేశ్ లో స్థిరపడిన గోడే మురహరిని  కాంగ్రెస్ నిలబెడితే గొర్రెల్లాగా ఓట్లేసి పార్లమెంట్ కు ఎన్నుకున్నారు. కాబట్టి ఇప్పుడేదో సమైక్య ఆంధ్ర ఉద్యమంవల్ల, కాంగ్రెస్ పని అయిపోయింది అనుకుంటే పొరబాటే!






16, సెప్టెంబర్ 2013, సోమవారం

నినాదాలు దారిద్ర్యాన్ని పోగోట్టగలవా!


నినాదాలు దారిద్ర్యాన్ని పోగొట్టగలిగితే ఎంత బాగుండేది! అలా జరిగే పనేనా? నిజానికి నినాదాలే కనుక   దారిద్ర్య  నివారణకు మంత్రాలైతే, 1971 కాంగ్రెస్ వారి "గరీబీ హటావో" నినాదం తరువాత దేశంలో పేదరికం పారిపోయ్యేది. ఆ నినాదం ఈనాటికీ వారికి అవసరం అవుతున్నది అంటే అర్ధం ఏమిటి!


నినాదాలు, అందునా రాజకీయ నాయకుల నినాదాలు పేదరిక నిర్మూలనకు మూల సూత్రాలు కానే కావు, నిజాయితీ లేని, ఓట్లకోసం మాత్రమె అంత్య ప్రాసలతో రచింప బడిన నినాదాలు, నినాదాలుగానే మిగులుతాయి.  ఆపైన తరువాత తప్పనిసరిగా వచ్చే వైఫల్యాలను చవిచూడక తప్పదు అన్న ప్రాపంచిక నిజాన్ని ఊమెన్ గారు మరొక్క సారి తన కార్టూన్  లో చక్కగా చూపించారు


అక్టోబరు 29, 1971 వార పత్రికలో ప్రచురణ


అప్పట్లో సిమ్లాలో కాంగ్రెస్ సభలు జరిగాయి, నినాదాలను సహజంగానే గుప్పించారు, ఊకదంపుడు ఉపన్యాసాలు సరే సరి.  ఆ సంవత్సరం (1971) లోనే "గరీబీ హటావో" అనే నినాదంతో ఇందిరా గాంధీఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. 1969లో కాంగ్రెస్ ను చీల్చిన తరువాత, ఆమెకు దక్కిన మొదటి విజయం అది. 

 
1971 అక్టోబర్ లో హిమాచల్ ప్రదేశ్  కైలాష్ నగర్ లో జరిగిన ఎ ఐ సి సి సమావేశపు వార్త


తమ సభలు, సమావేశాలు అనే ఫిరంగులను దారిద్ర్యం వైపు  ఎక్కుపెట్టి, తమ ఉపన్యాసాలు, నినాదాలు, కబుర్లనే తూటాలుగా వాడి దరిద్రం అనే శత్రువు వైపు కాల్పులు సాగిస్తుంటే, ఆ దరిద్రం, నేను "వట్టి కబుర్లు" తో తానూ ఎగిరిపోతాను అని ఎవరు చెప్పరర్రా అంటూ వాళ్ళను ఎద్దేవా చేయటం, కార్టూనిస్టుకు మాత్రమే తట్టే ఆలోచన. 

కార్టూనిస్ట్ రాజకీయ నాయకుల అంతరంగాన్ని కూడా సరిగ్గా పసికట్టి కార్టూన్లు వెయ్యగలగాలి. అలాంటి కార్టూన్లు వెయ్యటం లో ఊమెన్ గారిది అందెవేసిన చేయి. 
బంగ్లాదేశ్ సమస్యను సాకుగా వాడుకుని తాము చేసిన వాగ్దానాలను గుట్టుచప్పుడుగా నీటి మీద వ్రాతలుగా చెయ్యగలమని ఆనందిస్తున్న రాజకీయ నాయకులు
అపట్లో పశ్చిమ పాకిస్థాన్  అని తూర్పు పాకిస్తాన్ అని మన దేశానికి రెండువైపులా పాకిస్థాన్  ఊండేది. తూర్పు పాకిస్తాన్ పూర్తిగా బెంగాలీ మాట్లాడే పాకిస్తానీయులు. వారు పశ్చిమ పాకిస్థాన్  వారి దమన నీతిని, పాకిస్తాన్ మిలిటరీ అణచివేతను భరించలేక, తిరుగుబాటు చేసి, తమకు ప్రత్యెక దేశాన్ని ఏర్పరుచుకున్నారు. అదే  ఈనాటి బంగ్లాదేశ్. పైన చెప్పిన స్వాతంత్ర్య దేశం ఏర్పడే క్రమంలో, సహజంగా పాక్ సేనలకు, బంగ్లా తిరుగుబాటు దారులకు సంకుల సమరం జరిగింది, అందులో భారత్ బంగ్లాకు మద్దతుగా నిలిచింది. అలా బంగ్లాదేశ్ లో అంతర్యుద్ధం జరుగుతుండగా లక్షల మంది బెంగాలీ మాట్లాడే తూర్పు పాకిస్తానీయులు భారత్ కు కాందిశీకులుగా/శరణార్ధులుగా  వచ్చి పడ్డారు  అన్ని లక్షలమందిని పోషీంచటానికి, భారత్ ప్రజలు  నానా తిప్పలూ పడ్డారు. ప్రభుత్వం బంగ్లా రిలీఫ్ పేరిట ప్రత్యెక పన్నులు విధించింది.

చివరకు పోస్టల్ కవర్లకు కూడా బంగ్లా రిలీఫ్ ఫండ్ పేరున అదనపు స్టాంపులు అంటించాలిసి వచ్చింది.  ప్రతి దిన/వార/మాస పత్రిక కూడా ధరలో అదనంగా రెండు పైసలు కలిపి వసూలు చేసి, ఆ రెండు పైసలూ ప్రభుత్వానికి కట్టేవారు. ఆ విధంగా బంగ్లాదేశ్ సమస్య భారత ప్రజలను అన్ని రకాలుగా పీడించి పారేసింది.



14, సెప్టెంబర్ 2013, శనివారం

మొదటి కార్టూన్


ఊమెన్ గారి కార్టూన్లు ప్రప్రధమంగా ఆంధ్ర పత్రిక సచిత్ర వార పత్రిక వారు 20 07 1960 వార పత్రికలో ప్రచురించారు. అప్పటి ప్రకటన ఈ విధంగా ఉన్నది.
ఊమెన్ గారు వేసిన మొదటి కార్టూన్లు 
పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం!?
పాకిస్థాన్ లో అప్పటి రాజకీయ పరిస్థితి కి అద్దం పడుతూ వేసిన కార్టూన్. సైనిక నియంత ఐన ఆయూబ్ ఖాన్ అధికారాన్ని హస్తగతం చేసుకుని, దేశాన్ని పరిపాలించటం మొదలు పెట్టాడు. ఉట్టి మాటలతో రాజ్యాంగం అంటూ తమ దేశంలో ఏదో ప్రజాస్వామ్యం ఉన్నది అన్న భ్రమ కల్పించటానికి ఆయన కొంత తూ  తూ  మంత్రపు ప్రయత్నం చేశారు. సైనిక నియంత,  తానూ ప్రజాస్వామ్యబధ్ధుడిని అని ప్రజల నోళ్ళు నొక్కేసి,  తాను  రచింప చేసిన రాజ్యాంగాన్ని వాళ్ళ నెత్తిన రుద్దటం ఊమెన్ గారు అద్భుతంగా చెప్పారు ఈ కార్టూన్లో









 నెహ్రూ గారి పరుగు

ఇక ఈ కార్టూన్లో నెహ్రూ గారు తనకు మత్రమే తెలిసిన పంచవర్ష ప్రణాళికలను తయారుచేయిస్తూ, అప్పటి ఆర్ధిక పరిస్థితులతో ఆడుకున్నపటి విషయం. జాతీయాదాయం ఐదు శాతం అనుకుంటూ నెహ్రూ గారు పరుగు పెడుతున్నా  కూడా, ఆయన కన్నా ఎన్నో రెట్లు పెద్దగా,  చెట్టంత ఉన్న ద్రవ్యోల్బణం అనే మనిషి చులాగ్గా  నడిచిపోతూ, నెహ్రూ గారిని దాటి వెళ్ళిపోవటం, పెద్దగా ఎకానమీ మీద ప్రభావం చూపని నెహ్రూ గారి ఆర్ధిక విధానాలను నవ్వులు పాలు చెయ్యటమే అని ఊమెన్ గారి హాస్య పూర్వక విమర్శ. 

నెహ్రూ గారు ఆర్ధికవేత్త కాదు. ఏదో ఆయనకి ఉన్న రొమాంటిక్ ఆలోచనలతో తనకు తెలిసినట్టుగా పరిపాలించే ప్రయత్నం చేశారు. కాని ఈ నాడు, సాక్షాత్తుగా రిజర్వు బాంకు గవర్నరుగా చేసి, ఆర్ధిక మంత్రిగా చేసి అపారమైన అనుభవమున్న వారు ఉన్నతమైన స్థానంలో ఉన్నా కూడా, ఇవ్వాళ్టికీ ద్రవ్యోల్బణానిదే గెలుపు. ఎక్కడుంది, పొరబాటు! 

ఊమెన్ గారు ఈరోజున మన మధ్య ఉండి  ఉంటే, ఈ కార్టూన్ వేసిన 43 సంవత్సరాల తరువాత కూడా, ఊమెన్ గారు చెయ్యవలసినది ఒక చిన్న పని  మాత్రమే-నెహ్రూ బొమ్మ తీసేసి, మన్మోహన్ బొమ్మ తగిలించటం  అంతే!!  

జరిగినంత కాలం నా అంత వాడు లేడు, అనుకోవటం మానవ సహజమైన బలహీనత. ఈ బలహీనతకు ఎవ్వరూ మినహాయింపు కాలేరు, ఒక్క భగవద్గీతను అర్ధం చేసుకున్న వాళ్ళు తప్ప అని నా అభిప్రాయం.