సెప్టెంబరు 1, 1962 న ఆంధ్ర పత్రిక దినపత్రికలో వచ్చిన ఊమెన్ గారి కార్టూన్ |
పాపం నెహ్రూ గారి హయాంలో కూడా కాగ్రెస్ కు అంతర్గత కుమ్ములాటలు తప్పలేదు. పైగా అప్పట్లో కాంగ్రెస్ కు ఎదురు లేదు. ప్రతిపక్షం నామాక: మాత్రమే ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ లో టిక్కెట్ వస్తే చాలు అదొక గొప్ప పదవి దొరికినట్టే . ఇక గెలిచిన తరువాత ప్రతివాడూ పదవి కోసం మిగిలిన వాళ్ళ మీద ఎత్తుల మీద పై ఎత్తులు వేసుకుంటూ ఎంతకైనా తెగించి తమకు కావలిసిన పదవో కాంట్రాక్టో సంపాయించటమే పరమావధి. నెహ్రూ గారేమో సిద్దాంతాల మనిషి. కాయితాల మీద సుభాషితాలు నమ్మేసే వాడు. ఆయన ఉన్నప్పుడే కాంగ్రెస్ అలా ఉంటే ఆయన పోయిన ఐదేళ్ళకల్లా వారి కూతురు కాంగ్రెస్ ను రెండుగా చీల్చి పారేసింది.అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో జరిగే కుమ్ములాటలు ఊమెన్ గారు అద్భుతంగా చిత్రీకరించారు.
జాతీయ సమైక్యత గురించి గోలకెత్తుతున్న పండిట్ జీ (నెహ్రూ) తన వెనుక జరుగుతున్నా అంతర్గత కలహాలు తెలియకా! తన ధ్యేయం, తన పార్టీలోనే ఆ సమైక్యత లేకపోవటం, ఆ విషయం ఒక సామాన్యుడు తనను ప్రశ్నించటంతో నివ్వెరపోతున్న నెహ్రూను, ఈ కార్టూన్లో మనం చూడవచ్చు. నెహ్రూ ముఖంలో భావం అద్భుతంగా పండించారు ఊమెన్.
ఇక ప్రస్తుతానికి వస్తే, పార్టీ నాయకత్వమే విదేశీయుల చేతను పెట్టి, కొట్టుకోవటం మటుకు మానలేదు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమంటే, నానాటికీ కాంగ్రెస్ లోపల్లోపల కుళ్లిపోయి దిగజారిపోతుంటే, ప్రతిపక్షం కొంతలో కొంత క్రమశిక్షణ ఆలోచనలోనూ, ప్రవర్తనలోనూ కూడా చూపిస్తూ నానాటికీ బలపడింది.
ముందు ముందు ఏమి కానున్నదో చూడాలి మరి