16, సెప్టెంబర్ 2013, సోమవారం

నినాదాలు దారిద్ర్యాన్ని పోగోట్టగలవా!


నినాదాలు దారిద్ర్యాన్ని పోగొట్టగలిగితే ఎంత బాగుండేది! అలా జరిగే పనేనా? నిజానికి నినాదాలే కనుక   దారిద్ర్య  నివారణకు మంత్రాలైతే, 1971 కాంగ్రెస్ వారి "గరీబీ హటావో" నినాదం తరువాత దేశంలో పేదరికం పారిపోయ్యేది. ఆ నినాదం ఈనాటికీ వారికి అవసరం అవుతున్నది అంటే అర్ధం ఏమిటి!


నినాదాలు, అందునా రాజకీయ నాయకుల నినాదాలు పేదరిక నిర్మూలనకు మూల సూత్రాలు కానే కావు, నిజాయితీ లేని, ఓట్లకోసం మాత్రమె అంత్య ప్రాసలతో రచింప బడిన నినాదాలు, నినాదాలుగానే మిగులుతాయి.  ఆపైన తరువాత తప్పనిసరిగా వచ్చే వైఫల్యాలను చవిచూడక తప్పదు అన్న ప్రాపంచిక నిజాన్ని ఊమెన్ గారు మరొక్క సారి తన కార్టూన్  లో చక్కగా చూపించారు


అక్టోబరు 29, 1971 వార పత్రికలో ప్రచురణ


అప్పట్లో సిమ్లాలో కాంగ్రెస్ సభలు జరిగాయి, నినాదాలను సహజంగానే గుప్పించారు, ఊకదంపుడు ఉపన్యాసాలు సరే సరి.  ఆ సంవత్సరం (1971) లోనే "గరీబీ హటావో" అనే నినాదంతో ఇందిరా గాంధీఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. 1969లో కాంగ్రెస్ ను చీల్చిన తరువాత, ఆమెకు దక్కిన మొదటి విజయం అది. 

 
1971 అక్టోబర్ లో హిమాచల్ ప్రదేశ్  కైలాష్ నగర్ లో జరిగిన ఎ ఐ సి సి సమావేశపు వార్త


తమ సభలు, సమావేశాలు అనే ఫిరంగులను దారిద్ర్యం వైపు  ఎక్కుపెట్టి, తమ ఉపన్యాసాలు, నినాదాలు, కబుర్లనే తూటాలుగా వాడి దరిద్రం అనే శత్రువు వైపు కాల్పులు సాగిస్తుంటే, ఆ దరిద్రం, నేను "వట్టి కబుర్లు" తో తానూ ఎగిరిపోతాను అని ఎవరు చెప్పరర్రా అంటూ వాళ్ళను ఎద్దేవా చేయటం, కార్టూనిస్టుకు మాత్రమే తట్టే ఆలోచన. 

కార్టూనిస్ట్ రాజకీయ నాయకుల అంతరంగాన్ని కూడా సరిగ్గా పసికట్టి కార్టూన్లు వెయ్యగలగాలి. అలాంటి కార్టూన్లు వెయ్యటం లో ఊమెన్ గారిది అందెవేసిన చేయి. 
బంగ్లాదేశ్ సమస్యను సాకుగా వాడుకుని తాము చేసిన వాగ్దానాలను గుట్టుచప్పుడుగా నీటి మీద వ్రాతలుగా చెయ్యగలమని ఆనందిస్తున్న రాజకీయ నాయకులు
అపట్లో పశ్చిమ పాకిస్థాన్  అని తూర్పు పాకిస్తాన్ అని మన దేశానికి రెండువైపులా పాకిస్థాన్  ఊండేది. తూర్పు పాకిస్తాన్ పూర్తిగా బెంగాలీ మాట్లాడే పాకిస్తానీయులు. వారు పశ్చిమ పాకిస్థాన్  వారి దమన నీతిని, పాకిస్తాన్ మిలిటరీ అణచివేతను భరించలేక, తిరుగుబాటు చేసి, తమకు ప్రత్యెక దేశాన్ని ఏర్పరుచుకున్నారు. అదే  ఈనాటి బంగ్లాదేశ్. పైన చెప్పిన స్వాతంత్ర్య దేశం ఏర్పడే క్రమంలో, సహజంగా పాక్ సేనలకు, బంగ్లా తిరుగుబాటు దారులకు సంకుల సమరం జరిగింది, అందులో భారత్ బంగ్లాకు మద్దతుగా నిలిచింది. అలా బంగ్లాదేశ్ లో అంతర్యుద్ధం జరుగుతుండగా లక్షల మంది బెంగాలీ మాట్లాడే తూర్పు పాకిస్తానీయులు భారత్ కు కాందిశీకులుగా/శరణార్ధులుగా  వచ్చి పడ్డారు  అన్ని లక్షలమందిని పోషీంచటానికి, భారత్ ప్రజలు  నానా తిప్పలూ పడ్డారు. ప్రభుత్వం బంగ్లా రిలీఫ్ పేరిట ప్రత్యెక పన్నులు విధించింది.

చివరకు పోస్టల్ కవర్లకు కూడా బంగ్లా రిలీఫ్ ఫండ్ పేరున అదనపు స్టాంపులు అంటించాలిసి వచ్చింది.  ప్రతి దిన/వార/మాస పత్రిక కూడా ధరలో అదనంగా రెండు పైసలు కలిపి వసూలు చేసి, ఆ రెండు పైసలూ ప్రభుత్వానికి కట్టేవారు. ఆ విధంగా బంగ్లాదేశ్ సమస్య భారత ప్రజలను అన్ని రకాలుగా పీడించి పారేసింది.కామెంట్‌లు లేవు: