28, మే 2022, శనివారం

Wong Choice

 

సిరిమావో బండారునాయకే ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా, ఈ కార్టూన్ ఊమెన్ గారు జూన్ 1970లో వేశారు. ఎందుకనో కానీ,  శ్రీలంక మొదటినుంచి భారత దేశం తో కన్నా అక్కడేక్కడో ఉన్న దేశాలతో స్నేహం చెయ్యాలన్న తహతహ చూపిస్తూఉండేది.  


1971లో పాకిస్తాన్ బంగ్లా దేశ్ మీద దమన నీతి చూపిస్తూ, అక్కడి స్వతంత్ర పోరాటాన్ని మిలిటరీని పంపి అణచివేస్తుంటే, భారత్ చూడలేక, పాకిస్తాన్ విమానాలను భారత్ మీదుగా బంగ్లా దేశ్ వెళ్ళటాన్ని నిషేధిస్తే, శ్రీలంక పాకిస్తానుకు తమ దేశంలో వారి మిలిటరీ విమానాలకు రీ ఫ్యూయల్ చేసుకోవటానికి అనుమతిచ్చింది.


కార్టూన్లో చూస్తే, అప్పటి శ్రీలంక ప్రభుత్వాన్ని అటు రష్యా ఇటు చైనా కూడా తమ పక్కకు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాయని ఊమెన్ గారి ఉద్దేశ్యం. నిజమే.


శ్రీలంక చివరకు చైనా వలలో పడి, ప్రస్తుతం ఇప్పుదున్న దీన స్థితికి వచ్చింది.


పక్కనే ఉన్న గంగి గోవులాంటి భారత దేశాన్ని వదిలి, అక్కడెక్కడో ఉన్న దుష్ట చైనా తో స్నేహాన్ని చేసినందుకు శ్రీలంకకు జరగవలిసినదే జరిగింది. ఇప్పటికైనా శ్రీలంక తమ మంచి కోరే భారత్ ను అర్ధం చేసుకుంటే మంచిది. 

సామాన్యుడి కష్టం ఎప్పటికీ అదే!

 


ఈ కార్టూన్ ఊమెన్ గారు వేసి ఐదు దశాబ్ధాలు దాటిపోయింది. ఈ ఐదు దశాబ్ధాలలోనూ, ఆదాయపు పన్ను పరిధి దవ్యోల్బణాన్ని అనుసరించి సవరించారు తప్ప, నిజంగా ఆ పరిమితి పెరగనే లేదు.


పైగా, అలా వసూలు చేస్తున్న ఆదాయపు పన్ను, ఎంతవరకూ సజావుగా ఖర్చుపెట్టబడుతున్నది అనేది వంద కోట్ల ప్రశ్న.

ప్రతిపక్ష ఐక్యత!

 

ప్రతిపక్షాల ఐక్యత

ఈ కార్టూన్ 16 జనవరి 1970 సంచికలో ప్రచురితం అయ్యింది. అంటే 52 సంవత్సరాల పైగా కాలం గడిచిపోయింది. ఈ కార్టూన్ ఇప్పటికి మారని రాజకీయ పరిస్థితికి అద్దం పడుతున్నది. ఒక బలమైన అధికార పార్టీ, ఆ పార్టీని ఏదోవిధంగా పడగొట్టి తాము అధికారంలోకి రావాలని ప్రయత్నించే చిన్నా చితకా పార్టీలు. 

ఈ కార్టూన్లో, అప్పటి జనసంఘ్ (ఇప్పటి బిజెపి) నాయకుడు అటల్ బిహారీ వాజ్ పాయ్, పాత కాంగ్రెస్ నాయకుడు నిజలింగప్ప లను చూడవచ్చు. మధ్యలో ఉన్నాయన స్వతంత్ర పార్టీ ఎవరో తెలియటం లేదు. 

అప్పట్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నదన్న పుకార్లు, వాటితో పాటు ప్రతిపక్ష పార్టీల హడావిడి, కలిసి పోటీ చెయ్యటం వంటి ఎజెండాలతో మొదలయ్యి ఉంటుంది. అందుకనే నిజలింగప్ప, మనమందరమూ ఒకే మార్గంలో వెడుతున్నాము "అనుకుంటా" అని అంటున్నారు.

ఈ "అనుకుంటా" లోనే ఉన్నది అసలు రాజకీయం అంతా, అప్పటికి, ఇప్పటికీ రాజకీయ పార్టీలు, ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. బయటకు మాత్రం సమైక్యతా నినాదాలు గోలగోలగా "నోటితో" అంటూ ఉంటారు, లోపల్లోపల ఎవరి ప్రయత్నాలు వారివి. చివరకు ఎన్నికలు వచ్చినాక కొంత, ఫలితాల వెల్లడి తరువాత పూర్తిగానూ ఒక్కొక్కళ్ళ అసలు రంగులు బయటపడుతూ ఉంటాయి. 

ప్రజలను గందరగోళ పెట్టే చీకాకు పర్చే ఈ రాజకీయ అల్లరి, హడావిడి తగ్గాలి  అంటే, ఒక్కటే మార్గం. దేశంలో రెండు లేక మూడు జాతీయ స్థాయి  పార్టీలు మాత్రమే ఉండటం, అవ్వి కూడా మౌలికంగా ఒకటే రాజకీయ ధోరణి కలిగి ఉండటం. ఆచరణ మార్గాలు వేర్వేరు కావచ్చు, Basic Agenda దేశ సమగ్రత, అభివృధ్ది మాత్రమే ధ్యేయంగా ఉన్నప్పుడు మాత్రమే,  ఒకటి రెండు ఎంపిలు, అరడజను ఎం ఎల్ ఎ లపార్టీలు, వాళ్ళ వాళ్ళ కుల/ప్రాంతీయ ఎజెండాలు,  వీళ్ళ మధ్య పొత్తుల హడావిడి, తరువాత ఆ పొత్తుల విఫలం వంటి అనవసరపు రాజకీయపు హంగామా  తగ్గుతుంది. ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయానికి తక్కువ ప్రాధాన్యం ఇచ్చి, పరిపాలనకు అవసరమైన ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుంది. 
1, సెప్టెంబర్ 2018, శనివారం

ఏమిటీ కార్టూన్ అర్ధం!

 

ఈ కార్టూన్ అర్ధం కావాలంటే, అప్పటి నేపధ్యం తెలియాలి. ఈ కార్టూన్ వేసిన సమయం జనవరి 1970. అంటే కాంగ్రెస్ రెండు ముక్కలయ్యి గట్టిగా ఆరేడు నెలలు కూడా కాలేదు.

కాంగ్రెస్ కు గుర్తు జోడు కాడెద్దులు. ఇంతగా న్యాయం,ధర్మం అని ఉపన్యాసాలు ఇచ్చే నెహ్రూ, మనది వ్యావసాయిక దేశం కదా, పైగా నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న దేశం. అటువంటప్పుడు, ఇంతగా గ్రామీణులను ఎక్కువగా ప్రభావపరిచే గుర్తు పార్టీకి పెట్టుకుంటారా? అలా పెట్టటం ఎంతవరకూ సబబు!?  సుభాషితాలు ఉపదేశించటం  వ్యాసాలలో, తన కూతురుకు ఉత్తరాలలో,  లేదంటే ఉపన్యాసాలలో చెప్పటం సులువే. కానీ అవి స్వయంగా పాటించటమే గొప్ప నాయకుని లక్షణం. అదే లోపించింది.

అందుకనే, ప్రముఖ రచయిత, సంపాదకుడు శ్రీ పురాణం సుబ్రహమణ్య శర్మ తన ఇల్లాలి ముచ్చట్ల వ్యాస పరంపరలో  "ఎన్నికలలా" అనే  వ్యాసంలో ఇలా అన్నారు 

"...వాళ్ళకు జాతీయ పతాకానికి, కాంగ్రెసు జండాకి వున్న తేడా తెలీదు. ఇలాంటి ప్రజలుంటారనే మన నెహ్రూగారు కాంగ్రెసు జండాలో రాట్నం పీకిపారేసి చక్రం పెట్టారు. ఆ జండా ఈ జండాఒకటే అనే భావం కలిగేలా జాతీయ పతాకాన్ని రూపొందించకుండా వుండవలసింది".

సరే, ప్రస్తుతం కార్టూన్ విషయానికి వస్తే, అక్కడ ఉన్న ఇద్దరూ అప్పటి కాంగ్రెస్ గుర్తు ఐన కాడి జోడెద్దుల గురించి వాదులాడుకుంటున్నారు. గుర్తులో ఉన్న రెండు ఎద్దులూ చేరోకటీ తీసుకున్నా, కాడిని ఏమి చెయ్యాలి అని ఒకాయన వితండం చెయ్యటం జోకుగా వేసారు ఊమెన్ గారు. 

తరువాత, రెండు ముక్కల్లో కొత్త కాగ్రెస్, ఆవు దూడ గుర్తుగా తీసుకున్నది. విచిత్రం చూడండి. సెక్యూలర్ అని ఒకపక్క అరిచి గోలపెడుతూ, హిందువులకు పవిత్రమైన ఆవును తమ గుర్తులో పెట్టుకుని, హిందూ వోట్లను 1979-80 వరకూ ఆ పార్టీ విజయవంతంగా ప్రభావితం చెయ్యగలిగింది.

భూసంస్కరణలు!

కాంగ్రెస్ తమను తాము ప్రభుత్వంలో ఎల్లకాలమూ ఉంచుకోవటానికి తెచ్చిన ఒక "సద్దుపాటు" సంస్కరణ భూ సంస్కరణ. ఎదో సోషలిష్టు వ్యవస్థ తీసుకువస్తున్నట్టు నటిస్తూ, నిజానికి ఏమీ చెయ్యనివి ఈ భూ సంస్కరణలు. బాంకు పరీక్షల్లో బారతీయ ఆర్ధిక సమస్యల గురించి చదువుకున్నప్పుడు తెలిసింది, దేశంలోకెల్లా అత్యధిక విడాకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఇవ్వబడ్డాయట. కారణం, విడాకులు తీసుకుంటే, రెండు యూనిట్ల కింద లెక్కేసి ఎక్కువ భూమి ఆ కుటుంబానికి ఉంటుంది.

అదీ కాక, ఈ సంస్కరణలు తీసుకు వచ్చినది కాంగ్రెస్. కానీ కాంగ్రెస్ పార్టీ వారు కాని, కాంగ్రెస్ భక్తులు కానీ పెద్దగా ఈ సంస్కరణలను పాటించినట్టు కనపడదు. ఎవరికి వాళ్ళు సద్దుకున్నారు కానీ, సంస్కరణల్లో భూమి ఇచ్చిన కాంగ్రెస్ సమర్ధకులు కరువయ్యారు. ఎక్కడన్నా ఒకళ్ళో-ఇద్దరో అమాయకులు బలి అయిపోయి ఉండొచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ లో, అప్పట్లో ముఖ్య మంత్రి పి వి నరసింహారావు తీసుకు వచ్చిన  భూ సంస్కరణలను దెబ్బ తియ్యటానికి,1972-73లోప్రత్యెక ఆంధ్ర ఉద్యమం తీసుకు వచ్చారని ఒక పుకారు ఉన్నది.  

సంతోషించారు కానీ - వాళ్ళకు ప్రయోజనం లేకపోయింది


 
1960లలో, కమ్యూనిష్టు పార్టీ రెండు ముక్కలు అవ్వటం వాళ్ళ దృష్టిలో ఒక పెద్ద చారిత్రాత్మక ఘట్టం అనుకుంటారు కానీ, అలా జరగటం మన దేశంలో  ఎవ్వరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎదో కమ్యూనిష్టులు అనే కాని, రెండు ముక్కలు అయినా, ఆతరువాత ఎన్ని ముక్కలు అయ్యినా పెద్దగా ప్రజల్లో  "గణింపు" లేకపోయింది. కానీ అప్పటికే, స్వతంత్రం  వచ్చిన దగ్గరనుండీ దేశాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్, 1969 లో కుటుంబ పాలన కోసం రెండు ముక్కలు అయ్యింది. అలా రెండు ముక్కలు కావటానికి ఎవరు కారణమో అందరికీ తెలుసు.

ఇలా కాంగ్రెస్ రెండు ముక్కలు కావటం తమకేదో లాభిస్తుందని కమ్యూనిష్టులు భావించారని ఊమెన్ గారు వేసిన కార్టూన్. తాము అప్పటికే రెండు ముక్కలు అయ్యి, ఉన్న కాస్త బలం పోయి, బలహీనపడి తమ సంగతి చూసుకోకుండా వేరే పార్టీ రెండు ముక్కలు అవటాన్ని సంతోషంగా చెప్పుకోవటం పెద్ద జోకు. 

అప్పటికి అంటే జనవరి 1970 కి కాగ్రెస్ రెండు ముక్కలయ్యి జస్ట్ కొన్ని నెలలు మాత్రమె అవటం వలన, ఆయన వేసిన కార్టూన్ లో వాళ్ళు అలా సంతోషిస్తూ కనిపిస్తున్నట్టు వేశారు.  కానీ తరువాత్తరువాత జరిగిన ఎన్నికల పరిణామాలు పరిశీలిస్తే, కాంగ్రెస్ కు ఏమైనా, కమ్యూనిష్టులకు మాత్రం లాభం జరగలేదన్న విషయం తెలుస్తుంది. కాకపొతే, కాంగ్రెస్ చేసిన కొన్ని కొన్ని తప్పిదాల వల్ల, బెంగాల్ లో మాత్రం, కమ్యూనిష్టు ముక్కల్లో ఒకటి,  మూడు దశాబ్దాలు తమ "కబ్జా" పెట్టగలిగారు.

ఆణిగిపోయింది - అంతం కాలేదు!

 No automatic alt text available.
ఎప్పుడో 1972 లో ఊమెన్ గారు వేసిన కార్టూన్. అప్పటికే వోటర్లు కమ్యూనిష్టుల మీద వైముఖ్యం చూపించటం మొదలు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కొన్ని కొన్ని అవకతవకల వాళ్ళ బెంగాలులో మూడు దశాభ్దాలు ఆ రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలించినా, దేశపు అదృష్టం బాగుంది, జాతీయంగా పెద్దగా పైకి రాలేకపోయ్యారు.

ఇప్పటికి కూడా "నోటా"మాత్రపు వోట్లు రాని వామపక్షవాదులు చేస్తున్న "అల్లరి" చూస్తూనే ఉన్నాము.

ఆకాశవాణి ప్రామాణికత

 No automatic alt text available.

ఇప్పుడు అంటే ఆకాశవాణి ఒక్కటి మాత్రమె వినోద/సమాచార సాధనం కాదు. అనేకం ఉన్నాయి. ఇంటర్నెట్ వచ్చినాక, సమాచార విప్లవం జరిగి అరిచేతులో ఇమిడిపొయ్యే, మల్టీ పర్పస్ గాడ్జెట్ సెల్ ఫోన్ వచ్చేసింది. ప్రపంచంలో ఎక్కడ ఏమూల ఏమి జరిగినా క్షణాల్లో ప్రజలకు తెలిసిపోతున్నది.

కానీ దాదాపుగా 1990 మధ్య వరకూ కూడా, రేడియో అనేది మన దేశంలో ప్రధాన సమాచారా సాధనం. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి వచ్చే వార్తలు క్రమం తప్పకుండా ప్రజలు వినేవాళ్ళు. కానీ కాల క్రమేణా, ఆకాశవాణి వార్తలు, ఇతర కార్యక్రమాలూ, ముఖ్యంగా 1971 దగ్గరనుంచీ కూడా, ప్రభుత్వ కార్యక్రమాలను కీర్తిస్తూ (సమాచారం ఇవ్వటం కాదు) చేసిన కార్యక్రమాలే ఎక్కువ. పాలక పార్టీ కీ చెందిన ఒకే ఒక్క నాకయకురాలి మాటలు సుభాషితాలు లాగా ప్రచారం (ప్రసారం కాదు) చేసేవారు.

అలా మెల్లి-మెల్లిగా తన ప్రామాణికతను పోగొట్టుకుంటున్న ఆకాశవాణి మీద ఊమెన్ గారు వేసిన ఒక "విసురు" ఈ కార్టూన్లు.

జస్ట్ మూడు సంవత్సరాల తరువాత అప్పటి ప్రధాని తన పదవి కాపాడుకోవటానికి దేశంలో అవసరం లేని ఎమర్జెన్సీ విధించి ప్రజల ప్రాధమిక హక్కులను "సస్పెండ్" చేసినప్పుడు, ఆకాశవాణి విని ఎవ్వరూ వార్తలు తెలుసుకునేవారు కాదు. ఎంతయినా విచారకర విషయం ఏమంటే, భారత దేశంలో జరుగుతున్నా ముఖ్య సంఘటనల గురించి పరాయిం దేశాల రేడియో స్టేషన్ల మీద ఆధారపడవలసి వచ్చింది. బి బి సి, వాయిస్ ఆఫ్ అమెరికా వంటి విదేశీ వార్తా సంస్థల వార్తల నుండి మాత్రమె ఎమెర్జెన్సీ సమయంలో, దేశంలో జరిగిన/జరుగుతున్నా అవకతవకలను ప్రజలు తెలుసుకోగలిగారు.

బ్లాక్ మనీ

 No automatic alt text available.

ఊమెన్ గారు అప్పుడెప్పుడో 1972 లో వేసిన కార్టూన్ ఇది. ఇప్పటికి కూడా ఎంతో సరిపొయ్యే కార్టూన్. సంపాయించుకున్న దాంట్లో ఎక్కువ భాగం టాక్సులకే అన్నప్పుడు, ఆ కట్టిన టాక్సులకు తగిన సర్వీస్ తనకు రానప్పుడు, పౌరుడు టాక్సు ఎందుకు కడతాడు. సవ్యంగా పన్నులు కడుతున్న మనిషులను మరిన్ని టాక్సులు వేసి టాక్సు ఎగ్గొడితే అనే ఆలోచన ప్రభుత్వమే తీసుకొస్తున్నది అన్న మాట ముమ్మాటికీ నిజం.

10, ఫిబ్రవరి 2014, సోమవారం

ఎమర్జెన్సీ ప్రభావం

పైన ఉన్నది జూలై 1975 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ఊమెన్ గారు నిర్వహించిన లోకం పోకడ రాజకీయ కార్టూన్ల స్ట్రిప్. 

కార్టూన్ స్ట్రిప్ అనంగానే నాలుగైదు కార్టూన్లను ఒక చోట ప్రచురిస్తారు. కాని పైన చూడండి నాలుగు కార్టూన్లు వెయ్యటానికి నిర్ణయించి చివరకు రెండు కార్టూన్లనే ప్రచురించారు. సరే రెండే ప్రచురించారు మిగిలిన రెండూ ఖాళీగా ఎందుకు ఉంచారు?!  సమయానికి ఆ కార్టూన్లు ఊమెన్ పంపలేకపోయ్యారా? ఏదన్నా సాంకేతిక సమస్య వచ్చి ఆ బ్లాకులు (అప్పట్లో ప్రింట్ కు బ్లాకులు వాడేవాళ్ళు) రాలేదా!? కాదు, కానే కాదు. 

అలా కార్టూన్ల జాగా ఖాళీగా ఉంచటానికి కారణం అసమ్మతి, ఆందోళన. దేనికి,  ఎవరికీ వ్యతిరేకంగా! అప్పట్లో ఉన్న కాంగ్రెస్  ప్రభుత్వం తమ ప్రధాని ఇందిరాగాంధీ పదవి కాపాడుకోవటానికి కుంటి సాకులు చూపి, దేశంలో ఏదో ఘోరం జరిగియింది, జరగబోతున్నది అని ఒక బూచిని ప్రజలకు చూపించి మొట్టమొదటి సారిగా ఆత్యయిక పరిస్థితి (శత్రురాజ్యంతో యుద్ధం జరుగుతున్నప్పుడు కాకుండా) ప్రకటించటమే  కాకుండా, ప్రజల ప్రాధమిక హక్కులను హరించి వేసింది. అందులో ఒక భాగంగా ప్రభుత్వం సెన్సార్షిప్ ప్రవేశ పెట్టింది. ఇవ్వాళ అంటే మీడియాకు వెర్రెక్కిపొయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నది కాబట్టి సామాన్య ప్రజలే వీళ్ళను కట్టడి చేస్తే బాగుండును అనుకుంటున్నారు, కాని అప్పట్లో ఈ ఎలెక్ట్రానిక్  మీడియా లేదు, ప్రమోషన్ల జర్నలిజమో లేదు. ఉన్నది ఒక్కటే "జరిగినది-జరిగినట్టుగా" ప్రజలకు అందచెయ్యాలని ఎక్కువ పత్రికలూ పాటుపడే ప్రయత్నం చెసేవి. అప్పట్లోనూ చెంచా పత్రికలూ లెకపోలేదు, కాని వాటి సంఖ్య తక్కువ,  ఇప్పటిలా కాదు! సరే! అసలు విషయానికి వస్తే, అలా సెన్సార్షిప్ పెట్టి పత్రికలూ వ్రాయబొయ్యె వార్తలే కాదు కార్టూన్లను కూడా ప్రభుత్వ  "గుమాస్తాలు" చూసి అనుమతించేవారు. ఇక్కడ గుమాస్తా అంటే ఆంగ్లంలో అంటారే 'బ్యూరోక్రాట్" అని అది అన్న మాట. 

అలాంటి సెన్సార్షిప్ కు వ్యతిరేకంగా పత్రికల్లో ఉన్న "కొందరు" కార్టూనిస్టులు తమ అసమ్మతిని తెలియచెయ్యటానికి తాము వేసే కార్టూన్ స్ట్రిప్ లను ఖాళీగా ఉంచి ప్రచురించారు. అలా ఖాళీ స్ట్రిప్ ప్రచురించిన ఉంచిన మరొక ప్రముఖ కార్టూనిస్టు శ్రీ అబూ అబ్రహం. 

ఇలా ఖాళీ స్ట్రిప్ వెయ్యటం వల్ల, ఆ ఖాళీనే  ఎంతో విషయాన్ని చదువరులకు తెలియచెసేది. ఇక్కడ పాపం ఊమెన్ గారు  ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ కార్టూన్ వెయ్యబొయ్యారు, ప్రభుత్వ గుమాస్తా అనుమతియ్యలేదు అని అందరికీ తెలిసిబొయ్యెది. అంతే కాదు, ఆ ఖాళీలో కార్టూన్ ఏమయ్యి ఉంటుంది అని చర్చోపచర్చలు గ్రంధాలయాల్లో, ఆఫీసుల్లో, కాలేజీల్లో, నలుగురు గుమిగూడిన ప్రతిచోట జరిగేది. చివరకు ప్రభుత్వ గుమాస్తాలు పెట్టామనుకున్న సెన్సార్ షిప్ ఈ విధంగా అభాసు పాలు కావటం జరిగింది. ఇది చూసిన రాజకీయ బాసులు,  ఖాళీ జాగా కూడా ఉంచకూడదని మరొక నిబంధన తెచ్చి తమ లేని పరువు కాపాడుకునే ప్రయత్నం చేశారు. 

కాంగ్రెస్ పరువు తీసిన ఆత్యయిక పరిస్థితిలో ఇదొక ప్రహసనం!