10, ఫిబ్రవరి 2014, సోమవారం

ఎమర్జెన్సీ ప్రభావం

పైన ఉన్నది జూలై 1975 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ఊమెన్ గారు నిర్వహించిన లోకం పోకడ రాజకీయ కార్టూన్ల స్ట్రిప్. 

కార్టూన్ స్ట్రిప్ అనంగానే నాలుగైదు కార్టూన్లను ఒక చోట ప్రచురిస్తారు. కాని పైన చూడండి నాలుగు కార్టూన్లు వెయ్యటానికి నిర్ణయించి చివరకు రెండు కార్టూన్లనే ప్రచురించారు. సరే రెండే ప్రచురించారు మిగిలిన రెండూ ఖాళీగా ఎందుకు ఉంచారు?!  సమయానికి ఆ కార్టూన్లు ఊమెన్ పంపలేకపోయ్యారా? ఏదన్నా సాంకేతిక సమస్య వచ్చి ఆ బ్లాకులు (అప్పట్లో ప్రింట్ కు బ్లాకులు వాడేవాళ్ళు) రాలేదా!? కాదు, కానే కాదు. 

అలా కార్టూన్ల జాగా ఖాళీగా ఉంచటానికి కారణం అసమ్మతి, ఆందోళన. దేనికి,  ఎవరికీ వ్యతిరేకంగా! అప్పట్లో ఉన్న కాంగ్రెస్  ప్రభుత్వం తమ ప్రధాని ఇందిరాగాంధీ పదవి కాపాడుకోవటానికి కుంటి సాకులు చూపి, దేశంలో ఏదో ఘోరం జరిగియింది, జరగబోతున్నది అని ఒక బూచిని ప్రజలకు చూపించి మొట్టమొదటి సారిగా ఆత్యయిక పరిస్థితి (శత్రురాజ్యంతో యుద్ధం జరుగుతున్నప్పుడు కాకుండా) ప్రకటించటమే  కాకుండా, ప్రజల ప్రాధమిక హక్కులను హరించి వేసింది. అందులో ఒక భాగంగా ప్రభుత్వం సెన్సార్షిప్ ప్రవేశ పెట్టింది. ఇవ్వాళ అంటే మీడియాకు వెర్రెక్కిపొయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నది కాబట్టి సామాన్య ప్రజలే వీళ్ళను కట్టడి చేస్తే బాగుండును అనుకుంటున్నారు, కాని అప్పట్లో ఈ ఎలెక్ట్రానిక్  మీడియా లేదు, ప్రమోషన్ల జర్నలిజమో లేదు. ఉన్నది ఒక్కటే "జరిగినది-జరిగినట్టుగా" ప్రజలకు అందచెయ్యాలని ఎక్కువ పత్రికలూ పాటుపడే ప్రయత్నం చెసేవి. అప్పట్లోనూ చెంచా పత్రికలూ లెకపోలేదు, కాని వాటి సంఖ్య తక్కువ,  ఇప్పటిలా కాదు! సరే! అసలు విషయానికి వస్తే, అలా సెన్సార్షిప్ పెట్టి పత్రికలూ వ్రాయబొయ్యె వార్తలే కాదు కార్టూన్లను కూడా ప్రభుత్వ  "గుమాస్తాలు" చూసి అనుమతించేవారు. ఇక్కడ గుమాస్తా అంటే ఆంగ్లంలో అంటారే 'బ్యూరోక్రాట్" అని అది అన్న మాట. 

అలాంటి సెన్సార్షిప్ కు వ్యతిరేకంగా పత్రికల్లో ఉన్న "కొందరు" కార్టూనిస్టులు తమ అసమ్మతిని తెలియచెయ్యటానికి తాము వేసే కార్టూన్ స్ట్రిప్ లను ఖాళీగా ఉంచి ప్రచురించారు. అలా ఖాళీ స్ట్రిప్ ప్రచురించిన ఉంచిన మరొక ప్రముఖ కార్టూనిస్టు శ్రీ అబూ అబ్రహం. 

ఇలా ఖాళీ స్ట్రిప్ వెయ్యటం వల్ల, ఆ ఖాళీనే  ఎంతో విషయాన్ని చదువరులకు తెలియచెసేది. ఇక్కడ పాపం ఊమెన్ గారు  ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ కార్టూన్ వెయ్యబొయ్యారు, ప్రభుత్వ గుమాస్తా అనుమతియ్యలేదు అని అందరికీ తెలిసిబొయ్యెది. అంతే కాదు, ఆ ఖాళీలో కార్టూన్ ఏమయ్యి ఉంటుంది అని చర్చోపచర్చలు గ్రంధాలయాల్లో, ఆఫీసుల్లో, కాలేజీల్లో, నలుగురు గుమిగూడిన ప్రతిచోట జరిగేది. చివరకు ప్రభుత్వ గుమాస్తాలు పెట్టామనుకున్న సెన్సార్ షిప్ ఈ విధంగా అభాసు పాలు కావటం జరిగింది. ఇది చూసిన రాజకీయ బాసులు,  ఖాళీ జాగా కూడా ఉంచకూడదని మరొక నిబంధన తెచ్చి తమ లేని పరువు కాపాడుకునే ప్రయత్నం చేశారు. 

కాంగ్రెస్ పరువు తీసిన ఆత్యయిక పరిస్థితిలో ఇదొక ప్రహసనం!