28, మే 2022, శనివారం

ప్రతిపక్ష ఐక్యత!

 

ప్రతిపక్షాల ఐక్యత

ఈ కార్టూన్ 16 జనవరి 1970 సంచికలో ప్రచురితం అయ్యింది. అంటే 52 సంవత్సరాల పైగా కాలం గడిచిపోయింది. ఈ కార్టూన్ ఇప్పటికి మారని రాజకీయ పరిస్థితికి అద్దం పడుతున్నది. ఒక బలమైన అధికార పార్టీ, ఆ పార్టీని ఏదోవిధంగా పడగొట్టి తాము అధికారంలోకి రావాలని ప్రయత్నించే చిన్నా చితకా పార్టీలు. 

ఈ కార్టూన్లో, అప్పటి జనసంఘ్ (ఇప్పటి బిజెపి) నాయకుడు అటల్ బిహారీ వాజ్ పాయ్, పాత కాంగ్రెస్ నాయకుడు నిజలింగప్ప లను చూడవచ్చు. మధ్యలో ఉన్నాయన స్వతంత్ర పార్టీ ఎవరో తెలియటం లేదు. 

అప్పట్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నదన్న పుకార్లు, వాటితో పాటు ప్రతిపక్ష పార్టీల హడావిడి, కలిసి పోటీ చెయ్యటం వంటి ఎజెండాలతో మొదలయ్యి ఉంటుంది. అందుకనే నిజలింగప్ప, మనమందరమూ ఒకే మార్గంలో వెడుతున్నాము "అనుకుంటా" అని అంటున్నారు.

ఈ "అనుకుంటా" లోనే ఉన్నది అసలు రాజకీయం అంతా, అప్పటికి, ఇప్పటికీ రాజకీయ పార్టీలు, ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. బయటకు మాత్రం సమైక్యతా నినాదాలు గోలగోలగా "నోటితో" అంటూ ఉంటారు, లోపల్లోపల ఎవరి ప్రయత్నాలు వారివి. చివరకు ఎన్నికలు వచ్చినాక కొంత, ఫలితాల వెల్లడి తరువాత పూర్తిగానూ ఒక్కొక్కళ్ళ అసలు రంగులు బయటపడుతూ ఉంటాయి. 

ప్రజలను గందరగోళ పెట్టే చీకాకు పర్చే ఈ రాజకీయ అల్లరి, హడావిడి తగ్గాలి  అంటే, ఒక్కటే మార్గం. దేశంలో రెండు లేక మూడు జాతీయ స్థాయి  పార్టీలు మాత్రమే ఉండటం, అవ్వి కూడా మౌలికంగా ఒకటే రాజకీయ ధోరణి కలిగి ఉండటం. ఆచరణ మార్గాలు వేర్వేరు కావచ్చు, Basic Agenda దేశ సమగ్రత, అభివృధ్ది మాత్రమే ధ్యేయంగా ఉన్నప్పుడు మాత్రమే,  ఒకటి రెండు ఎంపిలు, అరడజను ఎం ఎల్ ఎ లపార్టీలు, వాళ్ళ వాళ్ళ కుల/ప్రాంతీయ ఎజెండాలు,  వీళ్ళ మధ్య పొత్తుల హడావిడి, తరువాత ఆ పొత్తుల విఫలం వంటి అనవసరపు రాజకీయపు హంగామా  తగ్గుతుంది. ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయానికి తక్కువ ప్రాధాన్యం ఇచ్చి, పరిపాలనకు అవసరమైన ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుంది. 
కామెంట్‌లు లేవు: