22, సెప్టెంబర్ 2013, ఆదివారం

పాపం గెరాల్డ్ ఫోర్డ్


పైనున్న కార్టూన్ ఫిబ్రవరి 1977 మొదటి వారంలో ప్రచురించబడింది.  అమెరికా చరిత్రలో  ప్రెసిడెంట్‌గా ఎన్నిక అవ్వని/అవ్వలేని ఏకైక ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్. వాటర్ గెట్ స్కాండల్ లో పూర్తిగా కూరుకుపోయి, చివరకు కాంగ్రెస్ (వాళ్ళ పార్లమెంట్) అభిశంసన తప్పించుకోవటానికి అప్పటి ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ రాజీనామాతో ఉపాధ్యక్షుడిగా ఉన్న   గెరాల్డ్ ఫోర్డ్, అమెరికా రాజ్యాంగం ప్రకారం అద్యక్షుడిగా అయ్యాడు. 

చిత్రం ఏమంటే,  రిచర్డ్ నిక్సన్ తో బాటుగా 1972 ఎన్నికల్లో ఉపాద్యకుడిగా ఎన్నిక అయినది గెరాల్డ్ ఫోర్డ్ కాదు . ప్రజలు ఎన్నుకున్నది అద్యక్షుడిగా నిక్సన్ తో పాటుగా ఉపాధ్యక్షుడిగా స్పైరో అగ్నూని. కాని అగ్నూ 1973లో టాక్సు గొడవల్లో చిక్కుకుని రాజీనామా చెయ్యాల్సి వచ్చింది. ఆ తరువాత గెరాల్డ్ ఫోర్డును నిక్సన్ తన ఉపాధ్యక్షుడిగా నియమించుకున్నారు. 

ఆ విధంగా ప్రజల చేత అద్యక్షుడిగా ఎన్నిక అవ్వకుండా అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన ఏకైక వ్యక్తిగా గెరాల్డ్ ఫోర్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. కాని అంతకంటే ఫోర్డ్ అధ్యక్షుడిగా సాధించింది ఏమీ లేదు. పైగా తనను ఉపాధ్యక్షుడిగా తీసుకున్నందుకు, నిక్సన్ ను ఆయన వాటర్ గెట్ స్కాండల్ వల్ల  రాజీనామా అనంతరం, క్షమించి, క్రిమినల్ చర్యలు తీసుకోకుండా ప్రెసిడెన్షియల్  పార్డన్ ఇచ్చి ఊరుకున్నారు. దీంతో నిక్సన్ తో ముందుగానే ఒక ఒప్పందం చేసుకుని అధ్యక్ష పీఠం  ఎక్కారని ఫోర్డ్ అపకీర్తి మూటగట్టుకున్నారు. 

అయినా సరే 1976 అద్యక్ష ఎన్నికల్లో, పదవిలో ఉన్న అధ్యక్షడిగా, ఎన్నికల్లో నుంచున్నారు ఫోర్డ్. రిపబ్లికన్ పార్టీ వారు కూడా, నిక్సన్ దెబ్బకు తమ పార్టీ గెలిచే అవకాశాలు ఎలాగో లేవన్న నిస్పృహలో ఏదో ప్రస్తుతపు అధ్యక్షుడే కదా అని తమ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికలో అబ్యర్ధిగా ఉంచారు. 

కాని, వియత్నాం యుద్ధంలో అపజయం, కంబోడియా లావోస్ లలో ఎదురు దెబ్బలు, అన్నీ కంటే వాటర్ గేట్ స్కాండల్ వల్ల, పెద్దగా ఎవరికీ తెలియని డెమొక్రాటిక్ అబ్యర్ధి జిమ్మీ కార్టర్ ఫోర్డును ఓడించారు. అమెరికన్ రాజ్యాంగం ప్రకారం ప్రతి అద్యక్షుడు తప్పకుండా నాలుగేళ్ళు పదవిలో ఉంటారు. కాబట్టి 1976 చివరి వరకూ ఫోర్డు ప్రెసిడెంట్ గా ఉండి  1977 లో పదవీ విరమణ చేశారు.  ఏదో నామకే వాస్తే అమెరికా అద్యక్షుడిగా కొద్ది కాలం ఉండి  వెళ్ళిపోయిన గెరాల్డ్ ఫోర్డ్ గురించి ప్రపంచ చరిత్రలో ఏమి వ్రాయబోతున్నారో, ఊమెన్ గారి ఊహ పైనున్న కార్టూన్. ఆయన అనుకున్నట్టుగానే గెరాల్డ్ ఫోర్డ్ అనామకంగానే నిలిచారు. 

విచిత్రం ఏమంటే, ఏ జిమ్మీ కార్టర్ ఐతే గెరాల్డ్ ఫోర్డ్ మీద ఘన విజయం సాధించారో, అదే జిమ్మీ కార్టర్ 1980 ఎన్నికల్లో రోనాల్డ్ రీగన్ చేతిలో చిత్తుగా ఓడిపొయ్యారు. కారణం, ఇరాన్ లో అమెరికన్ ఎంబసీ మీద అప్పటి ఖోమీనీ ప్రేరిత విద్యార్ధులుగా పిలవబడుతున్న వారు దాడి చేసి, ఎంబసీ సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. ఆ విషయాన్నీ సవ్యంగా, అమెరికాకు ఉన్న మిలిటరీ శక్తిని కూడా  వాడలేని అశక్త , దద్దమ్మ అద్యక్షుడిగా ముద్ర పడింది కార్టర్ మీద. ఆ దెబ్బకి, రిపబ్లికన్లు మంచి బలమైన రోనాల్డ్ రీగన్ ను అద్యక్ష పదవికి ఆబ్యర్ధిగా ఉంచారు. రీగన్ కార్టర్  మీద గెలిచి, ఆ తరువాత రెండోసారి కూడా అద్యక్ష ఎన్నికల్లో గెలిచి, అమెరికా ఎకానమీ మీద, విదేశీ విధానం మీద  చెరగని తనదైన ముద్రవేశారు. 

ఏది ఏమైనా అమెరికా  ఇతర దేశాల వ్యవహారాల్లో లో వేలు పెట్టటం వల్లనే (వియత్నాం, కంబోడియా, లావోస్, ఇరాన్) ఆ ప్రభావం వారి దేశీయ రాజకీయాల మీద కూడా విపరీత ప్రభావం చూపింది.


కామెంట్‌లు లేవు: