ఈ కార్టూన్ 1976 లో ప్రచురితం. అప్పట్లో కోల్డ్ వార్ (మన తెలుగు పద పండితులు దీనికి తెలుగు చేసినట్టు లేదు) అదే ప్రచ్ఛన్న యుద్ధం అమెరికా నాయకత్వం వహిస్తున్న నాటో దేశాలకు, కమ్యూనిస్ట్ రష్యా నాయకత్వం వహిస్తున్న వార్సా పాక్ట్ దేశాలకు బాహాటంగానే జరుగుతున్నది. ఎవరికి వాళ్ళు, తమ ప్రాబల్యం పెంచుకోవటానికి దేనికైనా వెనుదీయటం లేదు. చివరకు మాడ్ (MAD) అనే మాట వాడుకలోకి వచ్చింది అంటే Mutually Assured Destruction. రెండు వర్గాల దగ్గర అణు బాంబులు అంతకంటే ఎక్కువైనవే ఉండేవి. ఏ క్షణాన ఏమి జరుగుతుందో అని యూరోప్, అమెరికా ఖండాల ప్రజలు గుబగుబలాడుతూ ఉండేవారు.
రష్యా తన కమ్యూనిజాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి మొదలు పెట్టింది. ఈ ఎగుమతి విధానం వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో, జర్మనీ ఆక్రమించిన తూర్పు యూరోపు దేశాలను జర్మన్ల నుంచి విముక్తి చేస్తున్నట్టుగా నటిస్తూ, తమ తాబేదార్లను అక్కడ పరిపాలకులుగా ఉంచుతూ జర్మనీ వరకూ రష్యన్ సేనలు ముందుకు వెళ్ళటంతో బాగా మొదలయ్యింది.
అలా 1944-45 లో మొదలయిన రష్యన్ కమ్యూనిజం ఎగుమతి, 1970 లలో బాగా ప్రబలి, పెచ్చరిల్లింది. 1979 చివరి వారంలో ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించటం ఆ ఎగుమతికి పరాకాష్ట. కానీ,పాపం రష్యన్ల పాలిట ఆఫ్ఘన్ ఆక్రమణే యు ఎస్ ఎస్ ఆర్ గా పేరొందిన కమ్యూనిస్ట్ సామ్రాజ్యపు విచ్చిన్నానికి దారి తీసింది.
అంగోలా దగ్గరకు వస్తే, రష్యన్లకు తోడుగా, అమెరికాకు పక్కలో బల్లెంలా ఉన్న క్యూబా కూడా తోడయ్యింది. అంగోలా దేశానికి అప్పుడప్పుడే స్వాతంత్ర్యం వచ్చే అవకాశం ఉన్నది. కాని ఈలోగా అక్కడ అంతర్యుద్ధం మొదలయ్యింది. పోర్చుగీసు వారి వలస పాలననుండి తమ దేశాన్ని విముక్తి చేసుకోవటానికి, అంగోలా ప్రజలు ఎం పి ఎల్ ఎ (MPLA) అంగ్లంలో Popular Movement for the Liberation of Angola అనే సైనిక బృందం తయారయ్యింది. వాళ్ళకి రకరకాల ఎర చూపించి రష్యా వాళ్ళ పక్కన చేరింది. తమ ఉపగ్రహపు దేశమైన క్యూబా చేత సైన్యాన్ని పంపిస్తూ, తన ఆయుధాలను అంగోలాకు సరఫరా మొదలు పెట్టింది.
అదే సమయంలో నేషనల్ ఫ్రంట్ ఫర్ లిబరేషన్ అఫ్ అంగోలా (FNLA) National Front for the Liberation of Angola అనే మరొక పోటీ సైన్యం తయారయ్యింది. ఈ రెండూ కూడా పోర్చుగీసు వాళ్ళు వెళ్లి పోంగానే, తమలో తాము అంగోలా దేశంలో అధికారం చేచిక్కించుకోవటానికి తన్నుకోవటం మొదలు పెట్టారు. శత్రువుకు శత్రువు, తనకు స్నేహితుడు అన్న నియమం పాటిస్తూ, అమెరికా సహజంగా FNLA పక్కన చేరింది.
ఇప్పుడు ఊమెన్ గారి కార్టూన్ చూద్దాం
పై కార్టూన్లో ఎడమ పక్కన ఉన్నది అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింజర్ కుడి పక్కన నెత్తిన తట్టతో, మొహానికి నల్ల రంగు పూసుకుని, ఆఫ్రికన్ లాగ కనపడుతున్న మనిషి, అప్పటి రష్యన్ నియంత లియోనిద్ బ్రెజ్నేవ్.
ఆ రోజుల్లో రష్యా ఏ విధంగా బూకరించి, ఎలాగోలాగా ప్రతి దేశానికి తమ బ్రాండ్ కమ్యూనిజాన్ని ఎగుమతి చెయ్యటానికి ఎన్ని విధాల టక్కుటమారపు విద్యలు ప్రదర్శించేదో ప్రపంచానికి మొత్తానికి తెలుసు. అలా అంగోలాలో తాము మాత్రమే వేలు పెట్టవచ్చని, తాము కూడా ఆఫ్రికన్లమేనని బ్రెజ్నేవ్ బూకరిస్తున్నట్టుగా ఊమెన్ గారి కార్టూన్‌లోని వ్యంగ్యం. సామాన్యంగా మీరు చేస్తే తప్పు మేము చేస్తే ఒప్పు అన్నట్టుగానే రష్యన్ విదేశీ తంత్రం అంతా నడిచేది.
ఇలా అని అమెరికా ఊరుకున్నదని కాదు. రష్యాను నిలవరించటానికి రకరకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు. కాని వాళ్ళ ప్రయత్నాలు కలిసి వచ్చేవి కాదు. వియత్నాం, కంబోడియా, లావోస్, కొరియా వంటి దేశాల్లో ముఖం పగలగోట్టుకున్నారు. కాని ప్రయత్నం మటుకు మానలేదు. అంగోలాలో తమ సైన్యాన్ని పంపకుండా, అమెరికన్ కిరాయి సైనికులను పంపింది. వాళ్ళను ఎం పి ఎల్ ఎ వాళ్ళు పట్టుకుని, ఫైరింగ్ స్క్వాడ్ తో కాల్చి పారేసేవాళ్ళు. కారణం యుద్ధాల్లో మేర్సినరీస్ అంటే కిరాయి సైనికులకు శిక్ష మరణశిక్షే.
అంగోలాలో చివరకు క్యూబా పంపిన సైన్యాల సహాయంతో, రష్యా అండన ఎం పి ఎల్ ఎ అధికారంలో కి వచ్చి ఆ దేశాన్ని సర్వ భ్రష్టు పట్టించింది. ఆఫ్రికాలోనే ఉన్న జింబాబ్వే అనే మరొక దేశం కూడా, ఈ సోషలిజపు గాలి సోకి ఇప్పుడు ఎలా ఉన్నదో చూస్తూనే ఉన్నాము.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన "గాడ్స్ మస్ట్ బి క్రేజీ (Gods Must be Crazy) హాస్య ప్రధానమైన సినిమాల్లో (మూడు వేరు వేరు భాగాలుగా వచ్చినట్టున్నాయి) రెండో భాగంలో అనుకుంటాను, ఆఫ్రికాలో, క్యూబన్ సైనికులు ఉండటం అనే విషయాన్ని ఆటపట్టిస్తూ ఒక ప్రహసనం ఉన్నది.
ఏది ఏమైనా ఇజాలు ఎగుమతికి పనికిరావని, బెడిసి కొడుతుందని, రష్యన్ ఉదంతం తేల్చి చెప్పింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా తమ ఇజాన్ని ఎక్కించబోయి, చివరికి తమ స్వంత దేశంలోనే బొక్కబోర్లా పడి, ఆ ఇజం పెద్దగా ఎవరి సహాయమూ లేకుండా రష్యన్ ప్రజలే వాళ్ళకి అక్కర్లేదని ఆవతల పారేశారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి