28, సెప్టెంబర్ 2013, శనివారం

అత్తకూ అదే సమస్య - కోడలుకూ అదే సమస్యఈ కార్టూన్ ఊమెన్ గారు 1969, జూన్ నెలలో వేసినది. అప్పట్లో తెలంగాణా సమస్యగానే పరిగణించారు. పదవి దొరకక ఉన్న పదవితో తృప్తిపడలేని వారు నాయకత్వం వహించటం వల్ల, తెలంగాణాను కోరుకుంటున్న వారు నిజంగానే ప్రత్యేక రాష్ట్రం కావాలనుకుంటున్నారా, లేదా ఈ రాజకీయ నిరుద్యోగులు రెచ్చగొడితే, పదేళ్ళకొకసారి, మరొకొన్ని దశాబ్దాల తరువాత మరొకసారి ప్రత్యేక  తెలంగాణా మాట తెరమీదకు వస్తున్నదా అనేది శేషప్రశ్నగానే ఉన్నది. 

అప్పట్లో ఇందిరాగాంధీ తనదైన శైలిలో చెన్నారెడ్డిగారిని అటుచేసి
ఇటుచేసి తన పక్కకు తిప్పుకుని, ఆయన పార్టీ ద్వారా తెలంగాణా "సెంటిమెంట్" ను బాగా వాడుకుని ఎన్నికల్లో లబ్ధి పొంది, ఆయన పెట్టిన తెలంగాణా ప్రజా సమితి పార్టీని కాంగ్రెస్ లో కలిపేసుకున్నారు.అప్పట్లో ఇందిరాగాంధీకి వచ్చిన సమస్యే ఈనాడు ఆమె గారి కోడలికీ వచ్చింది. కాని ఇప్పటికీ  ఇది సమస్యగానే  పరిగణించి,  రాజకీయపు ఎత్తుగడలతో తాము సమస్య  అనుకునేది పరిష్కరిద్దామనే  కాని, అసలు ఈ గందరగోళానికి మూలాలు ఏమిటి, ఎక్కడ నుంచి మొదలుపెట్టి, మళ్ళీ  ఇలాంటి నిరసనలు, ఆందోళనలు పెచ్చరిల్లకుండా తీసుకోవాలిసిన చర్యలు, పరిష్కార మార్గాలు ఆలోచించాలి అన్న విషయం కూడా ఇప్పుడున్న ఆ కోడలికి కాని (పాపం విదేశీయురాలు, ఉత్సవ విగ్రహం), ఆమె చుట్టూ చేరిన అసలు సిసీలైన భారతీయ గ్రహాలకు గాని తట్టకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు.

ఎందుకు అంటె, ఏ గూటిలోని చిలుక ఆ గూటిలోని పలుకే పలుకుతుంది. కాంగ్రెస్ అనే పార్టీ, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సర్వభ్రష్టూ పట్టిపోయి, అందులో  ఎవరు చేరవచ్చు, ఎవరు చేరకూడదు అన్న గణనే లేకుండా, ఎవడు పడితే వాడు పదవి కోసం, చేరిపోయారు. గత కొన్ని దశాబ్దాలుగా, కాంగ్రెస్ ఏ సమస్యనూ సవ్యంగా  పరిష్కరించలేకపోయింది. కాంగ్రెస్ కు ప్రతి సమస్యలోనూ  రాజకీయ లబ్ధి మాత్రమే కనిపిస్తుంది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుని, అప్పటికప్పుడు వచ్చే తాత్కాలిక లబ్ధి పొందటమే పరమావధిగా ఎంచుకుంటున్నది.
దురాలోచనే కాని దూరాలోచన అనేది ఒకటి ఉంటుందన్న విషయం తెలిసిన వాళ్ళు ఒక్క కాంగ్రెస్సులో ఏమిటి ఇవ్వాళ దేశంలోనే కరువయ్యారు. ఎక్కడన్నా ఉంటే గింటే రాజకీయ అనామకులుగానే ఉన్నారు తప్ప, పెద్ద పదవుల్లో లేరు.
 
ఏతావాతా చెప్పొచ్చేది ఏమంటే, 1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని అప్పట్లో కాంగ్రెస్ ఇందిరా గాంధీ నాయకత్వంలో సమర్ధవంతంగా తమకు రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాడుకుని  వదిలేశారు. అప్పట్లో రాజకీయ వైకుంఠపాళీలో నిచ్చెన ఎక్కామని మురిసిపొయ్యారు.  కాని ఈనాడు, అదే రాజకీయ వైకుంఠపాళీలో పాము నోట్లో పడి దిగజారుతున్నారు. అంతకంటే ఘోరం, జరుగుతున్న విషయం గమనించుకోలేక, ఆ దిగజారుడే తమకు లాభం కలిగిస్తుందన్న అపభ్రంశపు ఆలోచనలో ఉన్నట్టుగా కనపడుతున్నది.      ఎప్పటికన్నా మన రాజకీయ పార్టీలు, పెద్ద మనసుతో ఆలోచించి సమస్యలకు, ప్రజా నిరసనలను అర్ధంచేసుకుని సవ్యమైన పరిష్కార మార్గాలు సూచించగలిగిన స్థాయికి ఎదగగలవా!? 


ఊమెన్ గారు 1969లో వేసిన కార్టూన్  ఈ నాటికి అన్వయించవచ్చు. కాకపోతే అప్పట్లో ఇందిరాగాంధీ, సమస్యకు పరిష్కారం చిక్కక చెమటలు పట్టించుకుంటే, ఈనాడు వారి కోడలు గారు, రాజకీయ లబ్ధి మాత్రమే పరమావధిగా  "రాజకీయ నిర్ణయాలు" తీసుకుంటూ, సమస్యలను సమస్యలుగా కాకుండా రాజకీయ అవకాశాలుగా  భావిచుకోవటం  ఒక్కటే ఈ 40 ఏళ్ళల్లో వచ్చిన మార్పు. 
 

ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్  లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి పరిష్కారం కనిపిస్తుందంటే ఎవరూ నమ్మలేని విషయంగా ఉన్నది. అత్తగారు పరిష్కరించలేని సమస్య కోడలు గారు పరిష్కరించగలరా పైగా  విదేశీ కోడలు! చూద్దాం ఏమి జరుగనున్నదో.
2 కామెంట్‌లు:

kannaji e చెప్పారు...

నమస్తే శివరామప్రసాదు గారూ,ముందుగా మీకు అభినందనలు,కొన్ని రొజుల రోజుల క్రిందట ఇలా ఊమెన్ గారి గురించి వెతుకుతూ ఉంటే మీ సాహిత్యాభిమాని బ్లాగు లో దొరీకింది.ఇప్పుడు ఊమెన్ గారిపై ఒక బ్లాగు మీరు ప్రారంభించడం మా అదృష్టం.
మీ బ్లాగు వివరాలను స్నేహితులతో పంచుకుంటే మీకు అభ్యంతరం ఉండదని భావిస్తూ

భవదీయుడు కన్నాజీరావు

Saahitya Abhimaani చెప్పారు...

కన్నాజి గారూ. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. నా బ్లాగులో ఉన్న సమాచారన్ని, ఊమెన్ కార్టూన్స్ బ్లాగు గురించి మీ స్నేహితులతో హాయిగా పంచుకోండి.